Asia Cup: నక్వీ బుర్ర బద్దలయ్యే న్యూస్.. భారత్ చెంతకు ఆసియా కప్ ట్రోఫీ.. ఎప్పుడంటే..!
Team India: ఈ వివాదం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అంతిమంగా ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకే చెందుతుందని బీసీసీఐ గట్టిగా వాదిస్తోంది. ఈ సమస్య ఐసీసీ జోక్యంతో పరిష్కారమవుతుందా, లేక నఖ్వీ తన పట్టుదలను వీడుతారా అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.

Team India: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టీమ్‌ఇండియా (Team India) విజేతగా నిలిచి నెల రోజులు దాటినా, కప్ ఇంకా భారత్‌కు చేరకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకటి లేదా రెండు రోజుల్లో ట్రోఫీ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని తాము ఆశిస్తున్నట్లు బోర్డు సంయుక్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఒకవేళ అలా జరగకపోతే, ఈ విషయాన్ని వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సమావేశంలో లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.
ట్రోఫీ వివాదానికి కారణం ఏంటి?
దుబాయ్‌లో సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు అయిన మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి భారత జట్టు నిరాకరించింది.
దీంతో నొచ్చుకున్న నఖ్వీ, ట్రోఫీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే నఖ్వీ ఆధీనంలో ఉంది.
ట్రోఫీని నేరుగా భారత్‌కు పంపించడానికి బదులుగా, బీసీసీఐ ప్రతినిధులు లేదా భారత జట్టులోని ఒక ఆటగాడు స్వయంగా దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయానికి వచ్చి, తన చేతుల మీదుగా తీసుకోవాలని నఖ్వీ పట్టుబడుతున్నారు.
బీసీసీఐ ఆందోళన..
బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ.. “నెల రోజులు గడిచినా ట్రోఫీ మాకు అందకపోవడంపై నిజంగా అసంతృప్తిగా ఉన్నాము.” “మేం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. పది రోజుల క్రితం కూడా ఏసీసీ ఛైర్మన్‌కు లేఖ రాశాం. కానీ, వారి వైఖరిలో మార్పు లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
“అయినా, ట్రోఫీ ఒకటి, రెండు రోజుల్లో ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి చేరుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపాడు.
ఐసీసీకి వెళ్లే అవకాశం..!
నవంబర్ 4 నుంచి దుబాయ్‌లో ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా ట్రోఫీని అప్పగించకపోతే, ఈ వివాదాస్పద అంశాన్ని బీసీసీఐ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లనుంది.
“ఒకవేళ ట్రోఫీ త్వరలో మాకు అందకపోతే, నవంబర్ 4న దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో మేం ఖచ్చితంగా ఈ విషయాన్ని లేవనెత్తుతాము” అని సైకియా స్పష్టం చేశారు.
బీసీసీఐ ఈ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, ట్రోఫీ భారత్‌కు తిరిగి వస్తుందని దేశ ప్రజలకు హామీ ఇవ్వగలనని సైకియా ధీమా వ్యక్తం చేశారు.
ఈ వివాదం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, అంతిమంగా ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకే చెందుతుందని బీసీసీఐ గట్టిగా వాదిస్తోంది. ఈ సమస్య ఐసీసీ జోక్యంతో పరిష్కారమవుతుందా, లేక నఖ్వీ తన పట్టుదలను వీడుతారా అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








