సునీల్ గవాస్కర్ ‘కొత్త కెప్టెన్’ కామెంట్స్‌పై దుమారం.. రోహిత్ శర్మకు పెరుగుతున్న సపోర్ట్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో లేకుంటే కొత్త కెప్టెన్ ను నియమించాలని సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు. సున్నీ కామెంట్స్ ను ఖండించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్. తన భార్య బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు.. ఏ తండ్రైనా పక్కనుండాలని కోరుకుంటారని.. కావాలినంత సమయాన్ని తీసుకుంటాడని పేర్కొన్న ఫించ్ ఆ విషయంలో మీ సూచన మాకు అనవసరం అని రిప్లై ఇచ్చాడు.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడబోతుంది టీమిండియా. అయితే ఈ సిరీస్ తొలి రెండు టెస్టులకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తన భార్య రితికా రెండవ బిడ్డకు జన్మనిస్తుండటంతో రోహిత్ తొలి టెస్టుకు ముందు ఇండియాకు తిరిగి వచ్చే అవకాశముంది. డెలివరీ ముందే అయితే తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉంటానని రోహిత్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వెళ తొలి టెస్టుకు రోహిత్ అందుబాటులో లేకుంటే వైస్ కెప్టెన్ జస్త్రీత్ బుమ్రా జట్టును నడిపించబోతున్నాడు.
రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదన్న వార్తలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్ ఆడాలని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. రోహిత్ మొదటి రెండు టెస్టులకి టీమ్ లో లేకపోతే.. మొత్తం సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ని నియమించాలని సూచించాడు. వ్యక్తిగత కారణాల వల్ల రెండు టెస్టులకు దూరమైన ఆటగాడు.. తిరిగి జట్టులో చేరేటప్పుడు కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరమేంటని సన్నీ సెలెక్టర్లను ప్రశ్నించారు. మొదటి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో ఉండకపోతే, అతన్ని ఒక బ్యాటర్ గా మాత్రమే పరిగణించాలని అదే సమయంలో కొత్త కెప్టెన్ ను ప్రకటించాలని సెలక్షన్ కమిటీకి సూచించారు.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాభవం తరువాత జరుగుతున్న టెస్ట్ సిరీస్ కావడం, WTC ఫైనల్ బెర్తు కోసం టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి జట్టు ఎంపిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సన్నీ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు. న్యూజిలాండ్ సిరీస్‌ని 3-0తో గెలుపొంది ఉంటే అది వేరే విషయం. కానీ మనం ఆ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయాం. జట్టుకు కెప్టెన్ అవసరం చాలా ఉంది. అందుకే మొదటి టెస్టులో కెప్టెన్ అందుబాటులో లేకపోతే మరొకరిని కెప్టెన్‌గా చేయడం ఉత్తమం అని గవాస్కర్ అన్నాడు.
అయితే సునీల్ గవాస్కర్ వాఖ్యలపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఘాటుగా స్పందించాడు. నేను సన్నీతో పూర్తిగా విభేదిస్తున్నానని తెలిపిన ఫించ్.. తన భార్య బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు.. ఏ తండ్రైనా పక్కనుండాలని కోరుకుంటారని.. కావాలినంత సమయాన్ని తీసుకుంటాడని పేర్కొన్న ఫించ్ ఆ విషయంలో మీ సూచన మాకు అనవసరం అని రిప్లై ఇచ్చాడు.
సునీల్ గవాస్కర్ కు ఘాటు రిప్లై ఇచ్చిన అరోన్ ఫించ్ పోస్టుకు రోహిత్ భార్య రితికా సజ్దేహ్ స్పందించారు. ఫించ్ పోస్టును ట్యాగ్ చేస్తూ సెల్యూట్ ఎమోజీ యాడ్ చేశారు. దీంతో ఫించ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా విరాట్ కోహ్లీ కూడా గత ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. అప్పుడు కూడా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న సమయంలోనే విరాట్ భార్య అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో కోహ్లీ ఇండియాకు వచ్చాడు. దీంతో సిరీస్ లో తదుపరి టెస్టులకు అప్పటి వైస్ కెప్టెన్ రహానే జట్టును నడిపించాడు.