IPL 2026: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతమైదానంలోనే మ్యాచ్‌లు..
Royal Challengers Bengaluru: డీకే శివకుమార్ హామీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. బెంగళూరు ఎప్పుడూ ఒక ప్రముఖ క్రికెట్ కేంద్రంగా ఉండాలని, ఇక్కడి నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కడికీ పోవని ఆయన హామీ ఇచ్చారు.

Royal Challengers Bengaluru: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఒక శుభవార్త. 2026 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన ఆర్సీబీ మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల వల్ల మ్యాచ్‌లు వేరే వేదికకు మారుతాయన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ హామీతో వారికి ఊరట లభించింది.
అసలు సమస్య ఏమిటి?
ఇటీవల బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయ ఉత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో, జస్టిస్ జాన్ మైకేల్ కున్హా నేతృత్వంలోని కమిటీ ఈ స్టేడియం భారీ కార్యక్రమాలకు సురక్షితం కాదని నివేదిక ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో భద్రతా కారణాల రీత్యా 2026 ఐపీఎల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి పూణేకు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
డీకే శివకుమార్ హామీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. బెంగళూరు ఎప్పుడూ ఒక ప్రముఖ క్రికెట్ కేంద్రంగా ఉండాలని, ఇక్కడి నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఎక్కడికీ పోవని ఆయన హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారం: స్టేడియంకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, చట్టపరమైన పరిమితులకు లోబడి, సరైన క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో స్టేడియాన్ని వినియోగిస్తామని చెప్పారు.
క్రికెట్ ప్రేమికుడిగా..: “నేను ఒక క్రికెట్ ప్రేమికుడిని. ఆర్సీబీ మన గర్వకారణం. అన్ని సమస్యలను సరిచేసి 2026 ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగేలా చూస్తాను” అని ఆయన భరోసా ఇచ్చారు.
కొత్త స్టేడియం ప్రస్తావన భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి, నగరంలో మరో పెద్ద స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కూడా డీకే శివకుమార్ పేర్కొన్నారు.
మొత్తానికి, డీకే శివకుమార్ ప్రకటనతో ఆర్సీబీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో కూడా తమ సొంత మైదానంలోనే మ్యాచ్‌లను వీక్షించే అవకాశం వారికి దక్కనుంది.




