Lawn Bowls: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది. ఐదో రోజు మహిళల లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 92 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్‌లోకి ప్రవేశించడంతో వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఎందుకంటే ఇప్పటివరకు లాన్ బౌల్‌లో భారతదేశం ఎటువంటి పతకం సాధించలేదు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది. భారత మహిళలు మంచి ఆరంభంతో ఆకట్టుకున్నారు. అయితే, 3 రౌండ్ల తర్వాత స్కోరు 3-3తో సమమైంది. దీని తర్వాత, భారత్ ధీటుగా బదులిచ్చి 7వ రౌండ్ తర్వాత 8-3 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఆధిక్యం భారత్‌తో ఎక్కువ కాలం నిలవలేదు. ఈ రౌండ్ తర్వాత, దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని పొందడం ప్రారంభించింది. 12వ రౌండ్ తర్వాత, ఇద్దరి స్కోరు 10-10తో సమానంగా నిలిచింది. అనంతరం పుంజుకున్న భారత మహిళలు 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి, బంగారు పతకం సొంతం చేసుకున్నారు.