CWG 2022 Indian Medal Winners: ఆరో స్థానంలో భారత్.. అదరగొట్టిన వెయిట్ లిఫ్టిర్స్.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే..
మొత్తం 13 పతకాలతో, కామన్వెల్త్ గేమ్స్ 2022 పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన ఈ 13 పతక విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఐదు రోజుల్లో ఇప్పటివరకు 128 బంగారు పతకాలు అథ్లెట్లకు అందాయి. అయితే భారత్‌కు 5 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. ఈ 5 బంగారు పతకాలతో పాటు 5 రజతాలు, 3 కాంస్య పతకాలను కూడా భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మొత్తం 13 పతకాలతో, కామన్వెల్త్ గేమ్స్ 2022 పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. భారతదేశానికి చెందిన ఈ 13 పతక విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
CWG 2022: 2వ రోజు
1. సంకేత్ మహదేవ్ సాగర్ (రజత పతకం)
వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి మొదటి పతకాన్ని అందించాడు. కామన్వెల్త్ క్రీడల రెండో రోజు పురుషుల 55 కేజీల వెయిట్ విభాగంలో స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కేజీలు అంటే మొత్తం 248 కేజీలు ఎత్తి రజతం సాధించాడు. అతను గోల్డ్ మెడలిస్ట్ వెయిట్ లిఫ్టర్ మలేషియాకు చెందిన మహ్మద్ అనిక్‌పై కేవలం ఒక కిలో వెనుకంజలో నిలిచాడు.
2. గురురాజ్ పూజారి (కాంస్య పతకం)
వెయిట్ లిఫ్టర్ గురురాజా పూజారి కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో 269 కేజీలు ఎత్తి కాంస్య పతకాన్ని సాధించాడు.
3. మీరాబాయి చాను (గోల్డ్ మెడల్)
ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం సాధించింది. 49 కేజీల విభాగంలో మొత్తం 201 కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించింది. మీరాబాయి స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తింది.
4. బిందియారాణి దేవి (రజత పతకం)
వెయిట్‌లిఫ్టర్ బిందియారాణి దేవి మహిళల 55 కిలోల బరువు విభాగంలో భారత్‌కు రజతం సాధించింది. స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలు అంటే మొత్తం 202 కేజీలు ఎత్తి రజతం సాధించింది. కేవలం 1 కేజీ తేడాతో ఆమె స్వర్ణం కోల్పోయింది.
CWG 3వ రోజు:
5. జెరెమీ లాల్రిన్నుంగ (గోల్డ్ మెడల్)
జెరెమీ లాల్రిన్నుంగ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించాడు. 67 కేజీల విభాగంలో 300 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించాడు. రజత పతక విజేత వైపావా లోనే (293 కేజీలు) కంటే 7 కేజీలు ఎక్కువ బరువు ఎత్తి ఛాంపియన్‌గా నిలిచాడు.
6. అచింత షియులీ (గోల్డ్ మెడల్)
పురుషుల 73 కిలోల వెయిట్ విభాగంలో స్నాచ్ రౌండ్‌లో 143 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 170 కిలోలు ఎత్తి అచింత షియులీ పతకం సాధించాడు. ఇలా మొత్తం 313 కేజీలు ఎత్తి భారత్‌కు మూడో స్వర్ణాన్ని అందించాడు.
CWG 4వ రోజు:
7. సుశీలా దేవి (రజత పతకం)
జూడో 48 కిలోల బరువు విభాగంలో సుశీలా దేవి లిక్మాబామ్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో, సుశీల దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా విట్‌బోయ్‌తో తలపడింది.
8. విజయ్ కుమార్ యాదవ్ (కాంస్య పతకం)
విజయ్ కుమార్ యాదవ్ జూడోలో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు జాషువా చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత రెపెచేజ్ మ్యాచ్‌లలో అవకాశం పొందాడు. ఇక్కడ అతను కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కాంస్య పతక పోరులో విజయ్ 10-0తో సైప్రస్‌కు చెందిన ప్రాటోను ఓడించాడు.
9. హర్జిందర్ కౌర్ (కాంస్య పతకం)
వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ మహిళల 71 కిలోల విభాగంలో మొత్తం 212 కిలోలు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హర్జీందర్ స్నాచ్‌లో 93 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కిలోలు ఎత్తింది.
CWG 5వ రోజు:
10. మహిళల లాన్ బాల్స్ టీమ్ (గోల్డ్ మెడల్)
లాన్ బాల్ మహిళల ఫోర్ ఈవెంట్‌లో భారత జట్టు తొలిసారి స్వర్ణం సాధించింది. లవ్లీ చౌబే, పింకీ, నయన్మోని సైకియా, రూపా రాణి భారత్‌కు ఈ పతకాన్ని అందించారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణం సాధించింది.
11. పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు (స్వర్ణం)
పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్‌ను 3-1తో ఓడించి భారత్ స్వర్ణం సాధించింది. శరద్ కమల్, జి సత్యన్, హర్మీత్ దేశాయ్ త్రయం భారత్‌కు ఈ స్వర్ణాన్ని అందించారు. ఇక్కడ శరద్ కమల్ తన సింగిల్స్ మ్యాచ్‌లో ఓడిపోయాడు. కానీ, సత్యన్, హర్మీత్ తమ సింగిల్స్ మ్యాచ్, డబుల్స్ మ్యాచ్‌లో గెలిచి భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు.
12. పురుషుల 96 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (రజతం)
వెయిట్ లిఫ్టర్ వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. వికాస్ స్నాచ్‌లో 155 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 191 కిలోలు ఎత్తాడు. మొత్తం 346 కిలోల బరువుతో రెండో స్థానంలో నిలిచాడు.
13. మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టీమ్ (రజతం)
మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3తో మలేషియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జంట ఓటమి పాలైంది. దీని తర్వాత మహిళల జోడీ త్రీజా జాలీ, గాయత్రి గోపీచంద్‌లు కూడా ఓడిపోయారు. కిదాంబి శ్రీకాంత్ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు ఒక్కతే విజయం సాధించింది.