AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lan Bowls CWG 2022: ‘లాన్‌ బాల్‌’ అద్భుతమైన గేమ్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయం..మీ చిన్ననాటి గోళీల ఆట గుర్తు చేస్తుంది..!

ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆటను పోలిన గేమ్‌ ఒకటి కామన్వెల్త్‌ క్రీడల్లో మెరిసింది. ఆ ఆట పేరు లాన్‌ బౌల్స్‌..ఈ ఆట గురించి మన దేశంలో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..

Lan Bowls CWG 2022: 'లాన్‌ బాల్‌' అద్భుతమైన గేమ్‌లో భారత్‌కు చారిత్రాత్మక విజయం..మీ చిన్ననాటి గోళీల ఆట గుర్తు చేస్తుంది..!
Lan Bowls F
Jyothi Gadda
|

Updated on: Aug 03, 2022 | 9:08 AM

Share

Lan Bowls CWG 2022: చిన్నతనంలో ఆడుకున్న గోళీల ఆట మీలో ఎంతమందికి గుర్తుకు ఉంది.. స్కూల్‌కి సెలవు దొరికినా, బడి నుంచి ఇంటికి వచ్చాకైన సరే..పిల్లలంతా ఒక్కచోట చేరి ఏ చెట్టుకిందో.. లేదంటే, కాస్త మైదానంగా ఉన్న ప్రదేశం దొరికితే చాలు..గుంపులుగా గోళీలు ఆడేవారు. రంగుల రంగుల గోళీలు నేలపై పోసి ఎంచుకున్న గోళీని సూటిపెట్టి కొడుతూ గెలిచే ఆట ఎంత సరదాగా ఉండేదో కదా..? కానీ, ఇప్పుడు గోళీల ప్రస్థావన ఎందుకనే కదా మీ సందేహం..ఎందుకంటే.. ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆటను పోలిన గేమ్‌ ఒకటి కామన్వెల్త్‌ క్రీడల్లో మెరిసింది. ఆ ఆట పేరు లాన్‌ బౌల్స్‌..ఈ ఆట గురించి మన దేశంలో అతి తక్కువగా మందికి మాత్రమే తెలుసు..అలాంటి గేమ్‌ కామన్వెల్త్‌ పోటీల్లో తళుక్కుమంది.. భారత్‌కు బంగారు పతకం సాధించిపెట్టింది.

పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో బౌల్స్‌గా పిలిచే పెద్ద సైజు బంతులతో పాటు.. ‘ది జాక్‌’అనే చిన్న బంతి ఉంటుంది. టాస్‌ వేసి ముందు ఎవరు బౌల్‌ చేస్తారో, ఎవరు జాక్‌ విసురుతారో నిర్ణయిస్తారు. ఒక జట్టుకు చెందిన ఆటగాళ్లు అండర్‌ ఆర్మ్‌ త్రో ద్వారా తొలుత జాక్‌ను విసిరితే.. ప్రత్యర్థి జట్టు బౌల్స్‌తో దాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇందులో సింగిల్స్‌, డబుల్స్‌తో పాటు టీమ్‌ గేమ్‌ ‘ఫోర్స్‌’ఫార్మాట్‌లు ఉంటాయి. ఇప్పుడు భారత మహిళల జట్టు స్వర్ణం నెగ్గింది ఈ ‘ఫోర్స్‌’విభాగంలోనే. ఈ ఫార్మాట్‌లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్‌ (ఎండ్‌)లో ఎనిమిది త్రోలు విసురుతుంది. ఇలాంటివి మొత్తం 18 రౌండ్లు ఉంటాయి. జాక్‌కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్‌ వేయడం ద్వారా ఫలితాన్ని నిర్దేశిస్తారు.

లాన్ బాల్ అవుట్‌డోర్, ఇండోర్ గేమ్. ఇది 1930 నుండి కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఉంది. ఈ సారి బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బాల్ గేమ్‌లో భారత జట్టు తొలిసారిగా పతకం సాధించింది. ఈ గేమ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి జార్ఖండ్ నుండి వచ్చిన పింకీ, లవ్లీ చౌబే, నయన్మోని సైకియా, రూపా రాణి టిర్కీలు మహిళల 4 లాన్ బాల్ టీమ్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించారు. భారత మహిళల జట్టు ఫైనల్‌కు చేరుకోగానే, ఈ క్రీడలో రజత పతకం ఫిక్సయింది. దానిని స్వర్ణంగా మార్చడానికి, వారు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించారు.

ఇవి కూడా చదవండి

గత 22 ఏళ్లుగా ఈ క్రీడలో భారత జట్టుకు ఎలాంటి పతకం రాలేదు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు 2010, 2014 మరియు 2018 సంవత్సరాల్లో భారత్ కూడా ఈ గేమ్‌లలో పాల్గొంది. రెండుసార్లు సెమీ-ఫైనల్‌కు కూడా చేరుకుంది. అయితే రెండు సార్లు (2010 మరియు 2014) ఓటమి కారణంగా నాలుగో స్థానంలో నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గేమ్‌లో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం. లాన్ బాల్‌లో ఇంగ్లండ్ ఇప్పటి వరకు 20 స్వర్ణాలు, 9 రజతాలు, 22 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 51 పతకాలు సాధించింది.

కానీ, సోమవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును 16-13 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఈ గేమ్‌లో తొలిసారిగా పతకం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 17-10 తేడాతో గెలిచి ఈ గేమ్‌లో దేశానికి మొదటి స్వర్ణం తెచ్చిపెట్టారు. భారత మహిళా జట్టు సృష్టించిన ఈ చరిత్ర కారణంగా ఈ గేమ్‌కు ఒక్కసారిగా ఆదరణ పెరగడంతో పాటు ఈ గేమ్‌పై ప్రజల్లో ఆసక్తి కూడా పెరిగింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి