AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం” కింద రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ పట్టనుంది.

శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా యాదగిరిగుట్ట!
Yadagirigutta Sri Lakshi Narasimha Swamy Temple
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 07, 2026 | 4:33 PM

Share

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం” కింద రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. దీంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మహార్దశ పట్టనుంది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి చిరునామాగా మారింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దే క్రమంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్ర నిధుల సహకారంతో మరింత భారీ ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది.

ఆధ్యాత్మికతకు ఆధునికత జోడింపు..

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వీకెండ్, పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అయితే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రోడ్లు, పార్కింగ్, వసతి, పర్యాటక సదుపాయాల విస్తరణ అవసరమవుతోంది. ఆలయ పున నిర్మాణ సమయంలోనే ఆలయ సన్నిధిలో ప్రపంచస్థాయి పర్యాటకులకు వసతి కల్పనకు అవసరమైన ఫైవ్ స్టార్ స్థాయి సదుపాయాలతో కాటేజీలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదించారు. అయితే నిధుల కొరతతో కేవలం ఆలయ పునర్నిర్మాణం, రహదారులు, ల్యాండ్ స్కేప్ గార్డెన్లు మాత్రమే అభివృద్ధి చేశారు. యాదగిరిగుట్టుకు వస్తున్న పర్యాటకులకు సరైన వసతి సదుపాయాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, అధికారులతో సమీక్ష సందర్భంగా మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలపై చర్చించినప్పటికీ నిధుల కొరత ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పర్యాటక ప్రాంతాలకు అందించే వడ్డీలేని మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సాయంలో నిధులను రాబట్టాలని భావిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం మూలధనం పెట్టుబడి సాయం పథకంలో రాష్ట్రాల్లోని వివిధ పర్యాటక ప్రాంతాలకు ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే విశేష సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్న ప్రాంతాలను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా దేశ విదేశాల పర్యాటకులను ఆకర్శించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రప్రభుత్వ మూలధన పెట్టుబడి కోసం సహాయ పథకంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను వడ్డీలేని రుణాలుగా అందిస్తోంది. ఇందుకోసం ఆధ్యాత్మిక విశ్వనగరిగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతోపాటు ఆధునిక దేవాలయంగా ఖ్యాతినొందిన నాగార్జునసాగర్ బుద్ధవనం, ప్రకృతిరమణీయ పచ్చటి కొండలు, గుట్టలతో అడ్వెంచర్ టూరిజంకు ప్రసిద్ధమైన వికారాబాద్ ప్రాంతంలోని అనంతగిరి కొండలను సైతం ఈ పథకంలో నిధుల మంజూరుకు ప్రతిపాదించారు.

యాదగిరిగుట్టకు రూ.500 కోట్లతో మహా ప్రణాళిక..!

ఈ మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం కింద యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ నిధులతో యాదగిరిగుట్టలో ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యాటక ఆకర్షణలు, రవాణా వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత రూ.500 కోట్లతో కొండ చుట్టూ రింగ్ రోడ్లు, ఆధునిక పార్కింగ్ కేంద్రాలు, ఎలక్ట్రిక్ వాహనాల సేవలు, పర్యాటక సమాచార కేంద్రాలు, డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

యాదాద్రి చుట్టూ టూరిజం సర్క్యూట్..

కేవలం ఆలయానికే పరిమితం కాకుండా, యాదాద్రిని కేంద్రంగా చేసుకుని భువనగిరి కోట, సురేంద్రపురి, కొలనుపాక జైన దేవాలయం, పోచంపల్లి వంటి ప్రాంతాలను కలుపుతూ సమగ్ర పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఇది అమలైతే దేశీయ, విదేశీ పర్యాటకులు ఒకే ప్రాంతంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక అనుభూతులను పొందే అవకాశం ఉంటుంది. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం, నాగార్జునసాగర్ బుద్ధవనం, అనంతగిరి కొండలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతలు కల్పనకు చేపట్టే చర్యలకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిధులను మంజూరు చేయనుంది.

ఈ పథకం మంజూరు అయితే.. తిరుమల, వైష్ణోదేవి తరహాలో యాదాద్రిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆలయ నిర్మాణ శైలి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు పర్యాటక మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రపంచ పటంలో యాదాద్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పం కనిపిస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us