సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? పూర్వ, ధృక్ సిద్ధాంతాలు ఏ తేదీ చెబుతున్నాయంటే?
జనవరిలో వచ్చే మకర సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండగ. అయితే, ఈ పండగను ఏ రోజు జరుపుకోవాలనేది మాత్రం ప్రతీ సంవత్సరం కొంత గందరగోళానికి దారితీస్తుంది. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగను జనవరి 14 లేదా జనవరి 15న జరుపుకోవాలా? అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. దీంతో పలువురు పండితులు, సిద్దాంతాలు సంక్రాంతి తేదీని సూచిస్తున్నాయి.

మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగ. ఈ పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో మూడు రోజులపాటు ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి పండగ తేదీపై సందిగ్ధత ఏర్పడింది. సంక్రాంతి పండగను జనవరి 14న జరుపుకోవాలా? లేక జనవరి 15న అనేది చాలా మంది ప్రజల్లో ఉన్న పెద్ద సందేహం. దీంతో ఏ రోజు జరుపుకోవాలనేదానిపై గందరగోళానికి గురవుతున్నారు. అయితే, సంక్రాంతి ఏరోజున జరుపుకోవాలనే విషయంపై పండితులు, శాస్త్రం చెప్పిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 తేదీల్లో లేదా జనవరి 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజును సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని బట్టి నిర్ణయిస్తుంటారు. ఈ సంక్రమణం ఎప్పుడు జరిగితే ఆరోజే సంక్రాంతి పండగను జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం జనవరి 14వ తేదీలో ఉండగా.. ఉదయం మాత్రం 15న ఉంటోంది. దీంతో ఏ రోజు జరపాలనేది సందిగ్ధతతకు దారితీసింది.
పండగను ఏ రోజున జరుపుకోవాలనేదాన్ని రెండు సిద్ధాంతాల ద్వారా నిర్ణయిస్తారు. వాటిలో ఒకటి పూర్వ సిద్ధాంతం, రెండోది ధృక్ సిద్ధాంతం. పూర్వ సిద్ధాంతం అంటే ప్రాచీన మహర్షులు చెప్పినది. ధృక్ సిద్ధాంతం అంటే ఆధునిక జ్యోతిష్య శాస్త్ర పండితులు ఖగోళ గ్రహాల కదలికలను బట్టి చెప్పే వివరాలు అని చెబుతున్నారు.
పూర్వ సిద్ధాంతం ప్రకారం సంక్రాంతి
పూర్వ సిద్ధాంతం ప్రకారం.. 2026, జనవరి 14వ తేదీ రాత్రి 9.12 గంటలకు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 14న రాత్రిపూట మకర సంక్రమణం జరుగుతుంది. కాబట్టి మరునాడు అంటే జనవరి 15న సంక్రాంతి పండగను జరుపుకోవాలని పూర్వ సిద్ధాంతం చెబుతోందని పండితులు తెలియజేస్తున్నారు.
ధృక్ సిద్ధాంతం ప్రకారం సంక్రాంతి
ధృక్ సిద్ధాంతం ప్రకారం.. జనవరి 14న మధ్యాహ్నం 3.07 గంటలకే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం మధ్యాహ్నమే జరుగుతుండటం వల్ల అదే రోజు అంటే జనవరి 14వ తేదీనే మకర సంక్రాంతి జరుపుకోవాలని ధృక్ సిద్ధాంతం చెబుతోంది.
అసలు సంక్రాంతి ఏ రోజు జరుపుకోవాలి?
పూర్వ సిద్ధాంతం ప్రకారం జనవరి 15న సంక్రాంతి కాగా, ధృక్ సిద్ధాంతం ప్రకారం జనవరి 14న సంక్రాంతి జరుపుకోవాలి. కానీ, ఈ రెండు తేదీల్లో ఏ రోజు జరుపుకోవాలని మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలు, పీఠాలు చెప్పిన దాని ప్రకారం సంక్రాంతి పండగను జరుపుకోవచ్చంటున్నారు.
ప్రముఖ ఆలయాలు తిరుపతి, విజయవాడ భద్రకాళి, భద్రాచలం, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాలు జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగను జరుపుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శృంగేరి పీఠం కూడా జనవరి 15నే సంక్రాంతి పండగను జరుపుకోవాలని నిర్ణయించింది. దీంతో ఈ ప్రముఖ ఆలయాలన్నీ కూడా పూర్వ సిద్ధాంతంను అనుసరించి సంక్రాంతి పండగను నిర్వహిస్తున్నాయి. కానీ, కంచి కామకోటి పీఠం మాత్రం ధృక్ పంచాంగాన్ని పరిగణలోకి తీసుకుంది. అంటే జనవరి 14నే సంక్రాంతిని ఇక్కడ జరుపుతారు. కాబట్టి ప్రజలు వారికి నచ్చిన సాంప్రదాయాలు లేదా సిద్ధాంతం ప్రకారం సంక్రాంతిని జనవరి 14 లేదా 15న జరుపుకోవాలో నిర్ణయించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
