Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri 2022: శివుడు భోళాశంకరుడు.. దానగుణశీలుడు.. గుక్కెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడతాడు

శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు." శ" అంటే "శివుడనీ" "వ" అంటే "శక్తి" అనీ శివపదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి..

Maha Shivaratri 2022: శివుడు భోళాశంకరుడు.. దానగుణశీలుడు.. గుక్కెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడతాడు
Maha Shivaratri 2022
Follow us
Balu

| Edited By: Ravi Kiran

Updated on: Mar 01, 2022 | 7:57 PM

ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి అత్యంత పవిత్రదినం. ఉపవాసం. శివార్చన. జాగరణ ఈ పర్వదినంనాడు ఆచరించాల్సిన ముఖ్య విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి లింగోద్భవం కాలం. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ణి ఆర్థిస్తారు. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభంగా అవతరిస్తాడు. దాని ఆదిని తెలుసుకోడానికి బ్రహ్మ హంసరూపంలో వెళ్లి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వస్తాడు. దాని అంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో విష్ణువు శ్వేతవరాహ రూపంలో వెళ్లి మహాలింగం మూలాన్ని కనుగొనలేక విఫలమవుతాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటిని ఆక్రమిస్తూ ఆద్యంతాలు లేని తేజోలింగరూపంలో నుంచి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ఆదిదేవుడిని చూసి బ్రహ్మ విష్ణువులు శివ తత్వాన్ని, సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. ఆ సుదినమే మహా శివరాత్రి.

శివుడి లింగాకారం సాకార బ్రహ్మకు సంకేతం. ఆయన నిరాకారుడు. నిర్గుణుడు. త్రిశూలం సత్త్వ రజస్తమోగుణాలకు, ఢమరుకం ఓంకార శబ్ద బ్రహ్మకు, చంద్రుడు నిశ్చల బుద్ధికి సూచకం. జటాజూటంలోని గంగ అమరత్వానికి చిహ్నం ! తన శరీరంపై వేలాడే సర్పాలు.. సమస్త ప్రాణకోటి పరమాత్మపై ఆధారపడతాయనడానికి సంకేతం. పాలభాగాన ఉన్న విభూతి సర్వ శుభాలకు సూచికైతే మూడో నేత్రం జ్ఞాన నేత్రం. గాయత్రీ మంత్ర జపంతో విడివడే ఉప నయనం ఇదే. ఆ పార్వతీనాథుడిని శివరాత్రి రోజు పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఆ కైలాస శైలాగ్రవాసుడిని స్మరిస్తే కైలాసప్రాప్తి సిద్ధిస్తుంది.

శివరాత్రి రోజు శివ పూజ ఇలా చేయాలి..

మహాశివరాత్రి పర్వదినాన వేకువజామునే నిద్రలేచి స్నానాదికాలు ముగించుకొని శివాలయానికి వెళ్లాలి. రుద్రాక్షలు, విభూది రేఖలను ధరించాలి. శివదర్శన పూజాదికాల తర్వాత శివనామ స్మరణతో పగటిపూట కాలం గడపాలి. రాత్రి నాలుగు జాముల్లోనూ నాలుగుసార్లు శివపూజను చేయాలి. మొదటి జాములో శివలింగాన్ని క్షీరంతో అభిషేకించాలి. పూజకు పద్మాలను వాడాలి. నైవేద్యానికి పెసరపప్పు, బియ్యం కలిపి వండిన పులగం ఉపయోగించాలి. రెండో జాములో పెరుగుతో అభిషేకం చేయాలి. మూడో జామున అవు నెయ్యితో అభిషేకం, మారేడు దళాలతో పూజ. నువ్వుల పొడితో చేసిన పదార్ధాల నివేదన చేయాలి. నాలుగో జామున తేనెతో అభిషేకించి నల్ల కలువతో పూజ చేయాలి. అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు.” శ” అంటే “శివుడనీ” “వ” అంటే “శక్తి” అనీ శివపదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివు లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్షమాలతో ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివ పురాణ పారాయణ చేస్తారు..

గరళకంఠుడిగా శివుడు..

క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. ఆ గరళధాటికి ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. సమస్త జీవులు పరమశివుడిని ప్రార్థించాయి. ఆదిభిక్షువు అభయమిచ్చాడు. ఆ కాలకూట విషాన్ని పానం చేశాడు. హాలహలం కడుపులో జారకుండా గొంతులోనే నిలిపివేశాడు పరమేశ్వరుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడు గరళకంఠుడయ్యాడు. నీలకంఠుడయ్యాడు. లోక శ్రేయస్సు కోసం శివుడు అంతటి కష్టాన్ని భరించాడు. గరళాన్ని మింగే ముందు పార్వతీదేవితో శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తానని శివుడన్నాడట! అప్పుడా గౌరి దేవి చిరునవ్వుతో అంగీకరించిందట! మ్రింగెడు వాడు విభుండని, మ్రింగెడిది గరళమనియును, మేలని ప్రజకున్‌ మ్రింగమనె, సర్వ మంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో. అవును అందుకే ఆమె జగన్మాత అయింది. అందుకే శివపార్వతులు ఆదిదంపతులయ్యారు. సర్వలోకాల్లోని సకల ప్రాణులకు జననీ జనకులయ్యారు…

భోళాశంకరుడు శివుడు..

శివుడు భోళాశంకరుడు. దానగుణశీలుడు. గుక్కెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు సంతోషపడతాడు. మారేడు దళాలతో అర్చిస్తే సంతృప్తి పడతాడు. మోక్షాన్ని ప్రసాదించి కైవల్యపదమిస్తాడు. ఇందుకు గుణనిధి కథే ఉదాహరణ. పూర్వం గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడుండేవాడు. అతగాడో పాపాల పుట్ట. దొంగతనం అతని వృత్తి. ఓ మహా శివరాత్రి రోజు శివాలయంలోనే దొంగతానికి వెళతాడు. శివనామ సంకీర్తనలతో ఆలయం మారుమోగుతుంటుంది. భక్తలంతా వెళ్లాక వచ్చిన పని కానిద్దామనుకుని శివలింగం వెనుక దాక్కుంటాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్దరీయపు పోగుల్ని తెంచి దానికి జత చేసి ఆవు నెయ్యి పోసి దీప ప్రజ్వలనం కావిస్తాడు. ఎప్పుడేమవుతుందోనన్న భయంతో తెల్లవార్లూ మేలుకుని వుండాడు.. పూర్తిగా తెల్లవారాక తలారి బాణం దెబ్బకు కన్నుమూస్తాడు.. బతుకున్నన్నాళ్లు దుశ్శీలుడిగా దుర్మార్గుడిగా నడిచినా, ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగారం తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్యకృత ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మిస్తాడు.. దముడనే పేరుతో మహారాజవుతాడు..తన రాజ్యంలోని శివాలయ్యాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయిస్తాడు.. ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడి ప్రాణసఖుడవుతాడు. శివరాత్రి రోజు ఉపవాస దీక్ష, జాగరం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో తెలిసింది కదూ!

పరమశివుడు భక్తుల పక్షపాతి..

మంత్రాలు. తంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు… మనస్ఫూర్తిగా ఏ ఒక్క పువ్వునైనా భక్తితో సమర్పిస్తే చాలు ఆనందపడతాడు. ఎనభై కల్పాల వరకు దుర్గతి లేకుండా చూస్తాడు. పెరటిలో పూసిన పువ్వుతో పూజిస్తే శివసన్నిధిలో శాశ్వత నివాసం దొరుకుతుంది. అడవిలో పూచిన పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం. ఆ దేవదేవుడికి సమర్పించే ఏ పువ్వుకైనా తొడిమ తప్పకుండా వుండాలి. బిల్వదళాలతో పూజిస్తే కైలాసవాసం లభిస్తుంది. దర్భపూలతో పూజిస్తే స్వర్ణలాభం కలుగుతుంది. తెల్లని మందారాలతో ఆర్చిస్తే అశ్వమేథం చేసిన ఫలం దక్కుతుంది. తామరలతో పూజిస్తే పరమపదగతి కలుగుతుంది. గన్నేరుపూలను ఏ సమయంలోనైనా శివుడికి సమర్పించవచ్చు. సంతోషంగా స్వీకరిస్తాడు. మల్లెలను రాత్రిపూట, జాజిపూలను మూడో జామున ఈశ్వరుడికి సమర్పించుకోవాలి. అప్పుడన్నీ శుభాలే.

శివరాత్రి పర్వదినాన ముందుగా విఘ్నేశ్వరుడిని వేడుకోవాలి. అనంతరం శివుడిని, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడిని, చివరగా పార్వతీదేవిని దర్శించుకోవాలి. శివ దర్శనం కూడా ఆషామాషీగా నంది వెనుక నిలబడి చేయకూడదు నందీశ్వరుడి కుడిచెవి దగ్గర మీ ముఖాన్ని వంచి ఎడమ చేతి చూపుడు బొటన వేళ్లతో నందీశ్వరుని చెవులపై అర్ధవృత్తంతో వుంచి కుడి చేతిని నందీశ్వరుని వాల భాగంలో అర చేయి మొత్తం ఆనేలా వుంచి నంది కుడి చెవిలో మూడుసార్లు, నందికేశా శివదర్శనం కోరుతున్నాను అనుగ్రహించు స్వామి అని చెబుతూ ఎడమ చేతి అర్ధవృత్తంలో ఏర్పడిన ఖాళీ ప్రదేశం నుంచి శివలింగాన్ని దర్శించాలి.

ఇలా చేస్తేనే శివ లింగ దర్శనం అవుతుంది…

ఆదిమధ్యాంతరహితుడైన ఆ ఆదిదేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా వుండటమే నిజమైన నియంత్రణం. ఉపవాసం అంటే అది. భౌతికాభిరుచులన్నింటినీ పక్కన పెట్టాలి. పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే మనసా వాచా కర్మణా తాదాత్మ్యం చెందాలి. యోగానందావస్థలోకి ప్రవేశించాలి. అప్పుడే కోటి సూర్య ప్రభలతో వెలుగొందే ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకోగలుగుతాం. మహా శివరాత్రి ఆంతర్యం కూడా ఇదే!

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: నివాస ప్రాంతాలపై రష్యా మిసైళ్లు.. కీవ్‌ను విడిచి వెళ్లాలని హెచ్చరికలు

Shivaratri 2022: తెలుగు రాష్ట్రాల్లో శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.. శివాలయాల్లో బారులు తీరిన భక్తులు

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..