Giri Pradakshina: విజయవాడ ఇంద్రకీలాద్రిలో వైభవంగా సాగిన గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్త జనం

విజయవాడ ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగింది. అరుణాచల క్షేత్రం తరహాలో ప్రతి పౌర్ణమికి దుర్గగుడిలో గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు.

Giri Pradakshina: విజయవాడ ఇంద్రకీలాద్రిలో వైభవంగా సాగిన గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్త జనం
Giri Pradakshina
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 04, 2023 | 9:05 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శోభకృత్‌ నామ సంవత్సరం పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సాగింది. దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ గిరిప్రదక్షణలో వందలాదిమంది భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అరుణాచల క్షేత్రం తరహాలో ప్రతి పౌర్ణమికి ఇక్కడకూడా గిరిప్రదిక్షిన చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొని అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమ్మరిపాలెం కూడలి, సితార, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టినగర్‌, కొత్తపేట, బ్రాహ్మణమీది నుంచి ఘాట్‌రోడ్డు వరకు జరిగింది.

డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరస్వామి వారి ప్రచార రథం ముందు సాగుతుండగా.. వెనుక దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను వాహనంలో ఉంచి..ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 9 కిలోమీటర్లు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని..స్వామి, అమ్మవార్లకు దారిపొడవునా పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. పౌర్ణమి రోజున అమ్మవారి శిఖరం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం