AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu: మానసిక ప్రశాంతత, సిరి సంపదలు పొందాలంటే.. ఇంటి దగ్గర పాటించాల్సిన వాస్తు నియమాలు ఇవే..

ఇంటి ప్రాంగణంలో సరైన దిశల్లో మొక్కలు, వృక్షాలు నాటడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సానుకూల శక్తి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మందార, మల్లి, గులాబీ వంటి పూల మొక్కలు పూజా కార్యక్రమాలకు ఉపయోగపడటంతో పాటు ఇంటికి ప్రశాంత వాతావరణాన్ని అందిస్తాయి.

Vastu: మానసిక ప్రశాంతత, సిరి సంపదలు పొందాలంటే.. ఇంటి దగ్గర పాటించాల్సిన వాస్తు నియమాలు ఇవే..
Vastu Tips For Wealth
Shaik Madar Saheb
|

Updated on: Jul 09, 2026 | 8:33 PM

Share

లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచడంలో వాస్తు నియమాలను పాటించడం ముఖ్యమని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందమైన ఇంటిని నిర్మించుకున్నప్పుడు, చుట్టూ ఖాళీ స్థలం ఉన్నప్పుడు, ఆ స్థలంలో ఎటువంటి చెట్లు నాటితే ఆరోగ్యము, ఐశ్వర్యం కలుగుతాయో తెలుసుకోవడం ఆవశ్యకమని.. దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే.. ఇంటి వాస్తు, శుభ్రత వల్ల ఐశ్వర్యం కలుగుతుందని.. ఈ విషయంలో అశ్రద్ధ వద్దని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, నిత్యం భగవంతుని ఆరాధనకు ఉపయోగపడే పూల మొక్కలు ఇంటి ప్రాంగణంలో తప్పనిసరిగా ఉండాలి. మందార, మల్లి, చామంతి, గులాబీలు వంటివి కేవలం ఇంటికి అందాన్ని మాత్రమే కాకుండా, సానుకూల శక్తిని కూడా అందిస్తాయి. ఈ మొక్కలను నాటేటప్పుడు భగవంతుని ధ్యానించి నాటితే అవి శతవిధాలా శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రాంగణంలో పూల మొక్కలు ఉండటం వల్ల ఇంటి యజమాని రోజు పూలు కోసి పూజకు వినియోగించినప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయం. ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది.

ఇంటి ప్రాంగణంలో పెద్ద వృక్షాలను నాటడానికి కొన్ని నిర్దిష్ట దిశలను వాస్తు సూచిస్తుంది. నైరుతి, దక్షిణం, ఆగ్నేయం, పడమర దిశల్లో మారేడు చెట్టు, ఉసిరిక చెట్టు, పనస చెట్టు వంటివి పెంచవచ్చు. ఈ చెట్లు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని గుర్తుంచుకోవాలి. అరటి, చక్రకేళి చెట్లను ఆగ్నేయ దిశలో పెంచడంలో తప్పు లేదు. అయితే, ఉత్తరం వైపు, తూర్పు వైపు భారీగా, ఎత్తుగా పెరిగే మొక్కలను పెంచకూడదు. ఈ దిశలలో పెద్ద వృక్షాలు ఇంటికి ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చని వాస్తు చెబుతోంది.

ఆధునిక కాలంలో చాలా మంది ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచుకుంటున్నారు. ఇవి ఇంటికి అందాన్ని, పచ్చదనాన్ని అందిస్తాయి. అయితే, వీటిని ఎక్కడ పెంచాలనే దానిపై వాస్తు నియమాలు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్‌ను హాల్లోనే ఉండే విధంగా చూసుకోవాలి. పడకగదిలో, బాత్‌రూమ్‌ల దగ్గర ఇండోర్ ప్లాంట్స్‌ను పెంచడం వాస్తు ప్రకారం సరికాదంటున్నారు. ఈ నియమాలు ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహాన్ని నిర్ధారిస్తాయి.

మారేడుతో ఇలా చేస్తే..

“వృక్షో రక్షిత రక్షితః” అనే సూక్తిని గుర్తుచేస్తూ, వృక్షాలను రక్షించడం మన కర్తవ్యం అని పండితులు నొక్కి చెబుతున్నారు. ప్రతి ఇంటి ప్రాంగణంలో ఒక మారేడు చెట్టు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మారేడు లక్ష్మీ స్వరూపమని, ఇది సాక్షాత్తూ సిరిసంపదలకు ప్రతీక అని వివరిస్తున్నారు. ప్రతి సోమవారం మారేడు మీద గంధం రాసి శివుడికి సమర్పిస్తే, ఆశుతోషుడైన పరమేశ్వరుడు తరగని సంపదను ప్రసాదిస్తాడని శాస్త్రం పేర్కొంటుంది.

ఇలా వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంటి వాతావరణం ఆహ్లదకరంగా మారుతుందని పండితులు చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సనాతన ధర్మంలో ప్రాచుర్యంలో ఉన్న సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, పండితుల వ్యాఖ్యానాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని మతపరమైన విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us