వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!
09 July 2026
Jyothi Gadda
మార్కెట్ నుండి తెచ్చిన పచ్చి చికెన్‌ను వండడానికి ముందు నీళ్లతో నాలుగైదు సార్లు శుభ్రంగా కడగడం అలవాటు. కానీ, వైద్య నిపుణులు, ప్రపంచ ప్రసిద్ధ ఆరోగ్య సంస్థ సిడిసి ప్రకారం.. ఈ అలవాటు చాలా ప్రమాదకరం.
పచ్చి చికెన్‌లో సహజంగానే రెండు రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం చికెన్‌ను సింక్‌లో పెట్టి నీటి పంపు కింద కడిగినప్పుడు, ఆ నీటి తుంపర్లు చికెన్ నుండి ఎగిరి దాదాపు మూడు అడుగుల దూరం వరకు పడతాయి.
దీనివల్ల వంటగదిలోని సింక్, పక్కనే ఉన్న గిన్నెలు, కత్తులు, కూరగాయలు, కిచెన్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఈ బ్యాక్టీరియా చాలా సులభంగా వ్యాపిస్తుంది. దీనిని సైంటిఫిక్ పరిభాషలో క్రాస్-కంటామినేషన్ అంటారు.
చికెన్ కడిగిన నీటి తుంపర్లు పడిన కిచెన్ ఉపరితలాన్ని మనం తాకి, ఆపై ఇతర ఆహార పదార్థాలను ముట్టుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా మన కడుపులోకి చేరుతుంది. దీనివల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
డయేరియా , కడుపునొప్పి, వాంతులు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులలో ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది.
చికెన్‌లోని బ్యాక్టీరియాను చంపడానికి ఏకైక మార్గం దానిని అధిక వేడిపై ఉడికించడం. చికెన్‌ను కనీసం 165°F (74°C) అంతర్గత ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడు అందులోని బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది.
పేపర్ టవల్ వాడకం: చికెన్‌పై రక్తం లేదా తేమ ఎక్కువగా ఉంటే, దానిని నీటితో కడగడానికి బదులుగా ఒక క్లీన్ పేపర్ టవల్‌తో తుడిచి, ఆ టవల్‌ను వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయాలి.
చేతులను శుభ్రం చేసుకోవడం: పచ్చి చికెన్‌ను తాకిన తర్వాత చేతులను కనీసం 20 సెకన్ల పాటు యాంటీబ్యాక్టీరియల్ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్ కట్ చేసిన బోర్డులు, కత్తులను కూడా వేడి నీరు, సబ్బుతో క్లీన్ చేయాలి.