AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramappa Temple: ప్రపంచ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప టెంపుల్.. యునెస్కో వారసత్వ పోటీకి ఎంపిక

ప్రసిద్ద రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన అద్భుత కళారూపం రామప్ప దేవాలయం.

Ramappa Temple: ప్రపంచ ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రామప్ప టెంపుల్.. యునెస్కో వారసత్వ పోటీకి ఎంపిక
Ramappa Temple
Balaraju Goud
|

Updated on: Jul 06, 2021 | 10:57 AM

Share

Ramappa Temple in UNESCO: ప్రసిద్ద రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన అద్భుత కళారూపం రామప్ప దేవాలయం.. అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధి. కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం.. శాండ్‌బాక్స్ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం… వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం. యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌కు రామప్పతో పాటు డోలవీర ఆలయం నామినేట్‌ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది.

2019లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ పోటీకి.. కేంద్రం నామినేట్ చేయగా.. యునెస్కో ప్రతినిధి రామప్ప ఆలయాన్ని సందర్శించి.. అన్ని అర్హతలున్నట్లు నివేదిక ఇచ్చారు. 2020 జులైలో యునెస్కో హెరిటేజ్ ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదాపడింది. ఆ తర్వాత కాకతీయ హెరిటేజ్, కేంద్ర పురావస్తు శాఖ రామప్ప విశిష్టతలను తెలియజేస్తూ ఆలయానికి సంబంధించిన మరింత సమాచారంతో పుస్తకం రూపొందించి.. పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయానికి సమర్పించారు.

ఇటీవలే రామప్ప ఆలయ ప్రాముఖ్యతను 6 భాషల్లో తెలియజేస్తూ.. చిత్రీకరించిన దృశ్యాలనూ పంపించారు. 2020, 2021 సంవత్సరాలకు ప్రపంచ వ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు.. రెండు కలగలిసినవి ఉండగా 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. వాటిలో మన దేశం నుంచి రామప్ప దేవాలయం మాత్రమే ఉండటం విశేషం. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన పదకొండు ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. కోవెలకు సంబంధించిన పూర్తి వివరాలు, నామినేట్‌ కావడానికి గల కారణాలనూ వివరించింది. ఇక 2021 నామినేషన్లలో మన దేశం నుంచి డోలవీర ఆలయం కూడా ఉంది. గతేడాది కొవిడ్‌ కారణంగా వారసత్వ గుర్తింపు ఇవ్వకపోవడంతో ఈ సారి 2020, 21 రెండు సంవత్సరాలకు ఒకేసారి గుర్తింపు ఇచ్చేందుకు ఈ నెల 16 నుంచి 23 వరకు ఓటింగ్‌ నిర్వహించనుంది.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రితో పాటు ఇతర అధికారులను కలిసి రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సానుకూలంగా స్పందించడం, తేదీలు ఖరారు కావడంతో.. ఇక రామప్ప వారసత్వ గుర్తింపునకు అడుగు దూరంలోనే నిలిచినట్లైంది. ఆ గుర్తింపు లభిస్తే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న ఏకైక కట్టడంగా రామప్ప ఖ్యాతిని గడించనుంది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషితో రామప్పకు పూర్వ వైభవం లభిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అన్ని పరిశీలనలు పూర్తయ్యాయని తెలిపారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రామప్పకు వారసత్వ గుర్తింపు తప్పక లభిస్తుందని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also…  Audio Goes Viral: మండపేటలో ఫ్లెక్సీల వివాదం.. వైసీపీ కార్యకర్తకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వార్నింగ్.. ఆడియో టేప్ కలకలం