TTD : రూ. 300 దర్శన టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేసిన టీటీడీ.. రోజుకు 3 వేల టిక్కెట్లు. ఇలా బుక్ చేసుకోండి..
తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 300 దర్శన టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేసింది. రోజుకు 3 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేశారు..
Tirumala Darshan Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం రూ. 300 దర్శన టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేసింది. రోజుకు 3 వేల టిక్కెట్ల చొప్పున విడుదల చేశారు. తిరుమల టీటీడీ వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం సరిచేసిన అనంతరం టిక్కెట్లు విడుదల చేశారు. ఈ రోజు నుండి ఆగస్టు 31వ తేదీ వరకు రోజుకు 3వేల అదనపు దర్శన టికెట్లు అందుబాటులో ఉంచింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 17 నుండి 20వ తేదీ వరకు టిక్కెట్ల విడుదల వాయిదా వేస్తున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇలాఉండగా, శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్ల పేరుతో మోసగిస్తున్న కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలపై ఫిర్యాదులు అందాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. టీటీడీ కల్యాణోత్సవం, రూ.300 టిక్కెట్లు బుక్ చేస్తామని మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. దర్శన టిక్కెట్లు ఇస్తామని చెన్నైకి చెందిన రేవతి ట్రావెల్స్ డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు.
భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో మాత్రమే టికెట్లు తీసుకోవాలని టీటీడీ సూచించింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.