Tirumala Tirupati: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు.. మీ సేవలు గొప్పవంటూ మహిళా భక్తురాలు ఈ మెయిల్..
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీవారు కొలువైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను..
Tirumala Tirupati: కలియుగ దైవం శ్రీవారు కొలువైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను టీటీడీకి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. శనివారం తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇంత మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ , సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదంలో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు. రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని ఆయన చెప్పారు.
టిటిడి లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు. సివిఎస్వో గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు.
మరోవైపు శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లిన హైదరాబాద్ లోని మల్కాజ్ గిరికి చెందిన నవత అనే శ్రీవారి భక్తురాలు టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఈఓ జవహర్‌రెడ్డికి ఈ–మెయిల్ పంపారు. తాను ఈనెల 6 తేదీ శ్రీవారి దర్శనానికి వెళ్లి సెల్ ఫోన్ పోగొట్టుకున్నానని.. అయితే విజిలెన్స్ కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు చేయగా.. సిబ్బంది స్పందించింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి.. గంటలోపు మొబైల్ ఫోన్ ను తనకు అప్పగించారని తెలిపింది. ఈ సమయంలో విజిలెన్స్ కంట్రోల్ రూం సిబ్బంది ఎంతో గౌరవంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరించారని అభినందిస్తూ శుక్రవారం ఈఓ జవహర్‌రెడ్డికి ఈ–మెయిల్ పంపారు.
Also Read: పూరి జగన్నాథ ఆలయం హుండీలో రూ. 28 లక్షల నగదు.. కరోనా తర్వాత ఇదే భారీ విరాళం..