Unique Shiva Temple: చంద్ర దోషమా, దంపతుల మధ్య గొడవలా.. ఇక్కడ శివయ్యకు తులసి దళాలతో పూజ చేయండి..
దేవుళ్ళను పూజించడానికి అనేక నియాలు ఉన్నాయి. పూజ, పూజ విధానం, పూజలో ఉపయోగించే ద్రవ్యాల నుంచి ధరించే దుస్తుల వరకూ రకరకాల నియాలున్నాయి. శివ కేశవులను బేధం లేకపోయినా పూజ విధానంలో తేడా ఉంది. విష్ణువుకి తులసి అంటే ఇష్టం.. శివుడికి బిల పత్రాలు అంటే ఇష్టం. అంతేకాదు కేవలం జలంతో అభిషేకం చేసినా కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. అయితే శివ పూజలో తులసి, మొగలి పువ్వు, కుంకుమ వంటి కొన్ని రకాల పదార్ధాలను పొరపాటున కూడా ఉపయోగించకూడదనే నియమం ఉంది. కానీ మన దేశంలో ఒక ఆలయంలో శివుడికి తులసి దళాలతో పూజ చేస్తారు. అది కూడా భార్యభర్తల మధ్య బంధం బలపడేందుకు తులసి దళాలతో పూజ చేస్తారు. ఆ ఆలయం ఎక్కడ ఉంది. వివిష్టత ఏమిటంటే..

హిందూ పురాణాల్లో దేవుడిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి, దేవునికి ఏ పువ్వుతో పూజ చేయలి, వేటితో చేయకూడదు దేవునికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి వంటి అనేక విషయాలను ప్రస్తావిస్తున్నాయి. సాధారణంగా తులసి దళం శ్రీ మహావిష్ణువుకి, శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. విష్ణువు అవతారాలను పూజించే దేవాలయాలలో తులసిని పూజకు ఉపయోగిస్తారు. అదేవిధంగా శివుడిని బిల్వ ఆకులతో పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం శివుడి పూజలో తులసిని ఉపయోగించరు. అయితే తమిళనాడులో ఒక ప్రత్యేక శివలాయం ఉంది. ఈ ఆలయంలో మాత్రమే తులసితో శివుడిని పూజించే ఆచారం ఉంది. భార్యాభర్తల మధ్య విబేధాలు తొలగి.. సామరస్యాన్ని పొందడానికి , జాతకంలో చంద్రుని బలాన్ని పెంచడానికి.. ఈ ఆలయంలో కొలువైన శివుడికి తులసి దళాలతో పూజిస్తారు.
ఆ వింత ఆలయం ఎక్కడ ఉందంటే
మన దేశంలో తులసి ఆకులతో శివుడిని పూజించే ఏకైక ఆలయం సింగపెరుమాళ్ ఆలయం. ఇది వల్లకోట్టై రోడ్డులోని కోలత్తూర్ గ్రామంలో ఉంది. తులసీశ్వరర ఆలయంలోని శివలింగం.. అగస్త్యుడు ప్రతిష్టించిన 108 శివలింగాలలో ఒకటి.
పురాణాల ప్రకారం కైలాసంలో శివపార్వతిల వివాహం చూడటానికి దేవతలు, ఋషులు , గంధర్వులు భూమి ఉత్తర భాగంలో సమావేశమయ్యారు. అలా దేవతలందరు ఒక చోటకు రావడంతో వారి శక్తి కారణంగా భూమి తన సమతుల్యతను కోల్పోయింది. దీనిని సరిదిద్దడానికి.. శివుడు అగస్త్యుడిని పిలిచి పరిస్థితిని తెలియజేశాడు. అగస్త్యుడు దక్షిణం వైపు వెళ్లి అక్కడ 108 శివలింగాలను ప్రతిష్టించి భక్తితో పూజించాడు.
అగస్త్యుడు శివుడిని పూజించడానికి ఒక చెరువును నిర్మించాడు. అతను తులసి దళాలతో శివుడిని పూజించాడు. అలా అగస్త్యుడు శివుడికి తులసి దళాలతో పూజించిన రోజు పౌర్ణమి. అగస్త్యుడి పూజకు సంతోషించిన శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో అగస్త్యుడికి దర్శనమిచ్చి అక్కడే తులసీశ్వరుడుగా స్థిరపడ్డాడు. ఈ పవిత్ర ఆలయంలో శివుడు ఇప్పుడు అర్ధనారీశ్వర లింగ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అందుకనే ఇది అరుదైన శివాలయాలలో ఒకటి.
అర్ధనారీశ్వర లింగం ప్రాముఖ్యత
ఈ సింగపెరుమాళ్ ఆలయంలోని లింగం 5 అడుగుల పొడవు ఉంటుంది. తులసీశ్వరుడు తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ, ఆయన ఈశాన్య మూల వైపు కొద్దిగా తిరిగి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ ఆలయం 900 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయం విక్రమ చోళుల కాలంలో నిర్మించబడిందని చెబుతారు.
సెంబియన్ అనేది చోళ రాజులను సూచించే పేరు. ఇది సామవేదాన్ని అధ్యయనం చేసిన పండితులకు ప్రసిద్ధి చెందిన పట్టణం. విల్వవన నాయకి సమేత తులసీశ్వరర ఆలయంతో పాటు ఈ పట్టణంలో అముధవల్లి తాయర్ సమేత తిరునారాయణ పెరుమాళ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం సింహ పెరుమాళ్ ఆలయం నుంచి 5 కి.మీ దూరంలో ఉంది.
ఆలయ ప్రవేశ సమయాలు
ఆలయం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. మళ్ళీ సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఈ ఆలయం ప్రతి రోజూ తెరిచి ఉంటుంది. సెలవులు,ఆదివారాల్లో ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కనుక ఈ ఆలయం మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








