AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu: ఆంధ్రలో తెలంగాణ బోనాలు.. ఈనెల 18న బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. సీఎం జగన్‌కు ఆహ్వానం

భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు షురూ!

Bonalu: ఆంధ్రలో తెలంగాణ బోనాలు.. ఈనెల 18న బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. సీఎం జగన్‌కు ఆహ్వానం
Telangana Bonalu In Andhra Pradesh
Balaraju Goud
|

Updated on: Jul 03, 2021 | 7:34 PM

Share

Telangana bonalu in Andhra Pradesh: రాబోయే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2010 నుంచి పాతబస్తీకి చెందిన ఉత్సవాల నిర్వాహకులు ప్రతి ఆషాడ మాసంలో విజయవాడ కనక దుర్గ అమ్మవారికి భక్తిశ్రద్దలతో బంగారు బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో జరిగే విజయవాడ బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరుగుతాయి. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి తెలంగాణ భక్కులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా ఈసారి బంగారు బోనాన్ని ఈ నెల 18న నిర్వహించడానికి కమిటి సిద్దమయ్యింది. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారికి బోనాలను సమర్పించనున్నారు.

ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణకు ముందురోజు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల విన్యాసాలతో హైదరాబాద్ పాతబస్తీ నుంచి బయలు దేరి విజయవాడ చేరుకుంటారు. విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు నిర్వహిస్తారు. రాబోయే ఉత్సవాలను పురస్కరించుకుని ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృదం గురువారం సాయంత్రం విజయవాడకు చేరుకుంది. శుక్రవారం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావును కలిసి విజయవాడలో నిర్వహించే తెలంగాణ ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలపై చర్చించింది. బోనాల ఊరేగింపుకు అవసరమైన తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈసారి బోనాల జాతర ఉత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు కమిటీ తెలిపింది. అయితే, అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని బోనాల ఉత్సవ కమిటి కోరింది.

కాగా, తమ వినతి మేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ దేవాలయం ఈవో,ఆలయ కమిటి చైర్మన్ లతో పాటు విజయవాడ పోలీసు కమిషనర్, ఏపీ సాంసృతిక శాఖ డైరెక్టర్ లను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు, అలాగే ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 30న, పాతబస్తీలోని ప్రధాన దేవాలయాలకు విజయవాడ కనక దుర్గ అమ్మవారి తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఆషాడ మాసం సందర్బంగా అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తొందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న,నగరానికి పట్టు వస్త్రాలు తీసుకురావడానికి దేవాలయం ఈవో తమ అంగీకారం తెలిపారన్నారు.

ఇక, హైదరాబాద్ మహానగరంలో జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ.. అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగనుంది. ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.

Read Also…  దేశ వ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులకు ఓ వర్గం యత్నం..ఢిల్లీ, యూపీలలో ఈడీ సోదాలు