Samatha Kumbh: సమతాకుంభ్ నాల్గవ రోజు హైలెట్స్ ఇవే..
కనరో భాగ్యము అన్నట్టుగా ముచ్చింతల్‌లో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువను తలపిస్తున్నాయి. దివ్యసాకేత రామచంద్రుడు గజవాహనసేవలో పాల్గొనగా, సాకేతవల్లీ అమ్మవారు హంసవాహనంపై కనువిందు చేశారు. ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు అద్వితీయం అనేలా సాగుతున్నాయి. నాల్గో రోజు రామాయణ గ్లోబల్ కాంటెస్ట్ ఉత్సాహభరితంగా సాగింది.

సమతాకుంభ్ 2024 బ్రహ్మోత్సవాలు కమనీయం, రమణీయం అన్నట్టుగా సాగుతున్నాయి. దివ్యసాకేత రామచంద్ర ప్రభువు గజవాహన సేవలో ఊరేగగా, సాకేతవల్లీ అమ్మవారు హంసవాహనంపై దర్శనమిచ్చారు. మదినిండా భక్తిభావం నింపిన ఈ ఘట్టాలు- భక్తులను కట్టి పడేసింది.

Samatha Kumbh 2024
సమతాకుంభ్‌లో ఇవాళ నాల్గవ రోజు. ఓవైపు వైదిక కార్యక్రమాలు, మరోవైపు గ్లోబల్ రామాయణ క్విజ్ కాంటెస్ట్ అందరినీ అలరించాయి. రామాయణం అంటే ఏంటో విడమర్చి చెప్పేలా ఈ కాంటెస్ట్‌ను నిర్వహించారు. ఏడు కాండలున్న రామాయణంలో ఏ సర్గలో ఏముందో అని అడిగితే, వాటికి వెంటనే సమాధానం ఇచ్చారు భక్తులు.
రామాయణ క్విజ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న వారికి దేవనాద రామానుజ జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి వారు మంగళాశాసనం చేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన ఈక్వాలిటీ కప్‌లో గెలిచిన క్రికెట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. అలాగే 18 గరుడ సేవలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నత్తం పెరుమాళ్ నుంచి తిరువహీంద్రపురం పెరుమాళ్ వరకు 18 దివ్యదేశాధీశులకు గరుడసేవలు జరిగాయి.
సుప్రభాతంతో నిత్య కార్యక్రమాలు మొదలు కాగా, తర్వాత అష్టాక్షరీ మంత్ర జపం జరిగింది. ఆరాధన, సేవాకాలం అయ్యాక – శాత్తుముఱై, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహించారు. నిత్యపూర్ణాహుతి, బలిహరణ సమయంలో యజ్ఞభగవానుడిని నమస్కరించుకుని తమ గోత్రాలు, పేర్లను చెప్పుకున్నారు భక్తులు. వేద విన్నపాలతో యాగ కార్యక్రమం జరిపించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ నటుడు సోనుసూద్ సమతాస్ఫూర్తి కేంద్రాన్ని దర్శించారు. 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ వైభవంగా సాగింది.