Tirumala News: బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు..
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధమైంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుండగా ఎల్లుండి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవ వేడుక భక్తులను కనువిందు చేయనుంది. ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనుండగా విద్యుత్తు వెలుగులతో తిరుమల కొండ కరువిందు చేస్తోంది. ఫల పుష్ప అలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకోగా 4 వేల మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్రహ్మోత్సవ వేడుక సాగనుంది.
Tirumala News: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్ధమైంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈ రోజు (సెప్టెంబర్ 17) అంకురార్పణ జరగనుండగా రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవ వేడుక భక్తులను కనువిందు చేయనుంది. ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనుండగా విద్యుత్తు వెలుగులతో తిరుమల కొండ కరువిందు చేస్తోంది. ఫల పుష్ప అలంకరణలతో ప్రత్యేక శోభను సంతరించుకోగా 4 వేల మంది పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్రహ్మోత్సవ వేడుక సాగనుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనుండగా టిటిడి ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించనున్న టిటిడి తిరుమలకు బ్రహ్మోత్సవ శోభను తీసుకొచ్చింది. రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా 18న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 18న ద్వజారోహణం జరగనుండగా రోజుకు రెండుసార్లు తిరుమల మాడా వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వాహన సేవలు అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కలుగ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులను మరింతగా ఆకట్టుకునేలా బ్రహ్మోత్సవ శోభను తీసుకొచ్చిన టిటిడి అలంకరణ వెలుగులతో తిరుమల క్షేత్రం కనువిందు చేసేలా తీర్చిదిద్దింది. తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ నుంచి మాడ వీధుల వరకు ఆలయ మహా ద్వారం నుంచి గర్భాలయం వరకు విద్యుత్ అలంకరణ వెలుగులతో నింపింది. తిరుమలలో ఎటు చూసినా విద్యుత్ కాంతులతో శంఖు చక్రాలు, శ్రీవారి ప్రతిమల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా మరోవైపు వివిధ రకాల పుష్పాలు పండ్లతో ప్రత్యేక అలంకరణ ఆకట్టుకుంటుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
18 న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుండటం తో ఈఓ ధర్మారెడ్డి అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు.గరుడ సేవ రోజు స్వామి వారిని ఎక్కువ మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీవారి గరుడ సేవ రాత్రి 7 గంటలకు మొదలవుతుందని రాత్రి 2 గంటలైనా భక్తులకు వాహన సేవ తిలకించేలా భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక గరుడ వాహన సేవ రోజున గ్యాలరీలో ఉండే భక్తులు సమయమనంతో సహకరించాలన్న ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు
తొమ్మిది రోజులపాటు పలు వాహన సేవల్లో భక్తులను కనువిందు చేయనున్న వెంకన్న…
తిరుమల సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వాహనసేవలపై కనువిందు చేయనున్నారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసం(ఆశ్వయుజం) లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది ఆనాటి నుండి నిరాటంకంగా ఇప్పటికే కొనసాగుతున్నాయి.
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేకపోగా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే..
ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని కాంక్షించడంతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యమైన ఆశీస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలను బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు టిటిడి నిర్వహిస్తుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దిన టిటిడి గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేసింది.
విఐపి బ్రేక్ సిఫార్సులకు బ్రేక్..
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించని టిటిడి స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతించనుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ రోజు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేసింది. సెప్టెంబరు 26న చక్రస్నానంకు విస్తృత ఏర్పాట్లు చేపట్టబోతున్న టిటిడి శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని, సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది.
కట్టుదిట్టమైన భద్రత..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి ప్రారంభం కానుండటంలో ఆలయ 4 మాడవీధుల్లో భద్రత ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆలయ మాడ వీధుల్లోని గ్యాలరీలలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించారు. సెప్టెంబర్ 18, 19 రెండ్రోజుల సీఎం జగన్ తిరుమల పర్యటన పై బందోబస్తు ఏర్పాట్లపై చర్చించిన డీజీపీ సేవా సదన్ -2లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 4 వేల మంది పోలీసులతో భద్రత ఉంటుందని, భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గరుడ వాహనసేవలో భక్తులను రీఫిల్లింగ్ చేస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం, వాహనసేవల దర్శనం కల్పించాలన్నారు. గరుడ సేవ రోజు అదనంగా 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తామన్న డిజిపి.. తిరుమలలో 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం, చిన్నారులకు జియో ట్యాగింగ్, భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నిర్వహణ, వీఐపీలు, భక్తుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. భక్తులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించామన్నారు. మాడ వీధులు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
రేపు అంకురార్పణం..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపు రాత్రి 7 నుండి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విష్వక్సేనులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించనున్నారు అర్చకులు. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి 9 రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.
18న ధ్వజారోహణం..
సెప్టెంబర్ 18న సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనుండగా బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సమక్షంలో వేద పండితుల మంత్రోక్షరణల మధ్య బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని అర్చకులు ఎగురవేస్తారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్దశేషవాహన సేవ జరుగనుంది.
18 న రాత్రి పెద్ద శేషవాహనం..
బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
19 న ఉదయం చిన్నశేషవాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల్లో ఉన్న నమ్మకం.
19 న రాత్రి హంస వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడని నమ్మకం.
20 న ఉదయం సింహ వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని సింహ వాహనసేవలో అంతరార్థంగా భక్తులు భావిస్తారు.
20 న రాత్రి ముత్యపుపందిరి వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామి ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాలకింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని భక్తుల నమ్మకం.
21న ఉదయం కల్పవృక్ష వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
21న సర్వభూపాల వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారని భక్తుల నమ్మకం.
22న ఉదయం మోహినీ అవతారం..
బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తాడు. పక్కనే స్వామి దంతపుపల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నాడని భక్తుల విశ్వాసం.
22న రాత్రి గరుడ వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు కీలక ఘట్టం గరుడసేవ. రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామి తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియ జెప్పుతున్నాడు.
23న ఉదయం హనుమంత వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని భక్తుల విశ్వాసం.
23 న సాయంత్రం స్వర్ణరథం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రథగమనాన్ని వీక్షించిన ద్వారకా ప్రజలకు ఎంతో ఆనందం కలిగింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుడిని చూసిన భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది.
23న గజవాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.
24 న ఉదయం సూర్యప్రభ వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి.
24 న రాత్రి చంద్రప్రభ వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హ దయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
25 న ఉదయం శ్రీవారి రథోత్సవం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం.
25న రాత్రి అశ్వవాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు.
26 న ఉదయం చక్రస్నానం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.
26 న రాత్రి ధ్వజావరోహణం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..