CM Jagan Tirumala Visit: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. ఘనంగా బ్రహ్మోత్సవాలు..
బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామి వారికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న సీఎం జగన్.. ముందుగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతికి చేరుకోగానే సీఎం జగన్.. గ్రామ దేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి, ఆర్‌కే రోజా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.. సీఎం జగన్ కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను జగన్ ప్రారంభించారు. అక్కడి నుంచి తిరుమలకు చేరిన తిరుమలలో జగన్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్.. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు పట్టు వస్త్రంతో సీఎం జగన్ తలకు పరికట్టం కట్టారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి 8.55 గంటలకు మాడవీధుల్లో శ్రీవారి పెద్ద శేష వాహన సేవ ప్రారంభమైంది. ఈ సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరుమల మాడ వీధుల్లో ఉభయ దేవేరులతో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత వైభవంగా జరగిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు.
కాగా.. మంగళవారం రాత్రి సీఎం జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని సీఎం జగన్ మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. అనంతరం నూతన పరకామణి భవనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలాజీ నగర్ లో నిర్మించిన రెస్ట్ రూమ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం తిరుమల నుంచి సీఎం జగన్ తిరుగు ప్రయాణంకానున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..