లక్ష్మీనారసింహుడికే నామం పెట్టారు.. యాదాద్రి ఆలయంలో బంగారు, వెండి డాలర్ల మాయం..!
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజుల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతోంది. చింతపండు చోరీ ఘటన మరువకముందే మరో బాగోతం వెలుగు చూసింది. దేవస్థాన ఆదాయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది గండికొడుతున్నారు.

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజుల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతోంది. చింతపండు చోరీ ఘటన మరువకముందే మరో బాగోతం వెలుగు చూసింది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సిబ్బంది గండికొడుతున్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ పునరుద్ధరణ తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొందరు ఏడాదిలో నాలుగైదు సార్లు దర్శంచి స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారు. ఆలయ పునరుద్ఘాటన తర్వాత భక్తుల తాకిడి ఎక్కువైంది. సాధారణ రోజుల్లో సగటున 30 నుంచి 50 వేల మంది వరకు వస్తున్నారు. ఇక పండుగలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. భక్తుల తాకిడితోపాటు స్వామి వారి ఖజానాకు కూడా ఆదాయం భారీగానే వస్తోంది.
అధికారుల నిర్లక్ష్యం..
అధికారుల అవినీతి, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆలయంలో ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. ఆరు నెలల క్రితం ఆలయంలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే చింతపండు చోరీ ఘటన మరువకముందే మరో బాగోతం వెలుగు చూసింది. తిరుమల తరహాలో యాదగిరిగుట్ట క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమతో కూడిన బంగారు, వెండి డాలర్లను 20 ఏళ్లుగా భక్తులకు దేవస్థానం విక్రయిస్తోంది. కొన్ని కారణాలతో మధ్యలో కొన్నేళ్లు బంగారు వెండి డాలర్ల విక్రయాలు నిలిపివేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాన ఆలయాన్ని పునరుద్ధరించడం తోపాటు స్వామివారి ప్రతిమతో కూడిన బంగారు, వెండి డాలర్ల విక్రయాలను తిరిగి ప్రారంభించింది.
బంగారు, వెండి డాలర్లు మాయం..
స్వామివారి ప్రతిమతో కూడిన బంగారు, వెండి డాలర్లను ప్రచార శాఖ ద్వారా దేవస్థానం విక్రయిస్తోంది. ఈవో పర్యవేక్షణలో దేవస్థాన ఏఈవో ఆధీనంలో కొనసాగే ప్రచార శాఖలో భద్రపరిచి విక్రయాలు సాగిస్తున్నారు. స్వామివారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కంపౌండ్‌కు ఆలయ ఈవో అందజేస్తారు. ఇందులో 200 బంగారం డాలర్లు, 1000 వెండి డాలర్లు సిద్ధం చేసిన తర్వాత ఈవో పర్యవేక్షణలో ఉంటాయి. ఇలా కొన్నేళ్లుగా తయారు చేయించి భక్తులకు బంగారు, వెండి డాలర్లను విక్రయిస్తున్నారు.
అస్తవ్యస్తంగా మారిన పాలన
గతకొన్నేళ్లుగా యాదాద్రి ఆలయ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆలయ ఈవోలు పూర్తి స్థాయిలో ఉండకపోవడంతో పాలన గాడి తప్పింది. ఆరు నెలల క్రితం స్వామివారి ప్రసాదంలో వినియోగించే చింతపండును కొందరు ఇంటి దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే భక్తులకు విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ.10లక్షలని అంచనా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు.
ఆలయంలో ఇంటి దొంగలు
యాదాద్రి ఆలయంలో ఇంటి దొంగల తో పాటు స్వామివారి ప్రతిమ కలిగిన బంగారు వెండి డాలర్లు మాయం కావడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. తమ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి బంగారు వెండి రూపంలో కానుకలుగా ఇస్తున్నామని భక్తులు చెబుతున్నారు. అలాంటి కానుకలతో తయారుచేసిన డాలర్లు మాయం కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, ఆలయ అధికారులు, సిబ్బందికి ఆధ్యాత్మిక భావన లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. గతంలో చింతపండు దొంగతనం పై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంవల్లే ఇంటి దొంగలు ఎక్కువ అవుతున్నారని ఆరోపిస్తున్నారు. డాలర్ల మాయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
