వైభవంగా గోవిందరాజస్వామి బ్రహోత్సవాలు.. ధ్వజారోహణంతో మొదలైన ఉత్సవాలు..
Sri Govinda raja Swamy Brahmotsavam: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం శ్రీవారి ఆస్థానం జరిగింది.
అంతకుముందు అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తు హోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.
స్నపన తిరుమంజనం…
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.
పెద్దశేష వాహనంపై…
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపును రద్దు చేశారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు పెద్దశేష వాహన సేవను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, కంకణ బట్టార్ శ్రీ ఏ.టి. పార్థసారధి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునీంద్రబాబు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.