ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశంలో ఆలయం.. 7 నెలలపాటు నీటిలోనే.. మన ఏపీలోనే

పంచ పాండవులు ప్రతిష్టించిన వేపదారు శివలింగం.. శ్రీశైలం రిజర్వాయర్‌కి వరదలు వచ్చినప్పుడు నీటిలో మునుగుతుంది.. నీరు తగ్గినప్పుడు బయటపడి పూజలు అందుకుంటుంది. ఏడు నదులు కలిసిన చోట వెలసి పూజలు అందుకుంటున్న సంగమేశ్వరుడి ఆలయ విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశంలో ఆలయం.. 7 నెలలపాటు నీటిలోనే.. మన ఏపీలోనే
Sangameswara Temple
Follow us
J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 30, 2023 | 6:39 PM

ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది.  సంఘమేశ్వరాలయంలోని వేపదారు శివలింగమును కృష్ణాజలాలు తాకాయి.  ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామశర్మ దంపతులు గంగమ్మకు చీర సారే సమర్పించి గర్భాలయంలోని వేపదారు శివలింగంకు ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించారు.  గత సంవత్సరం జూలై 15వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు రాగా జనవరి 30వ తేదీ ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చింది. ఆరు నెలలు భక్తుల పూజలందుకున్న సంగమేశ్వరుడు ఆరు నెలల అనంతరం జూలై 30వ తారీఖున కృష్ణమ్మ ఒడిలోకి చేరనున్నాడు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 845 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఈ నీటిమట్టం 850 అడుగులకు చేరుకుంటే సంఘమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్తుందని ఆలయ అర్చకులు తెలకపల్లి తెలిపారు. మళ్లీ స్వామి అమ్మవార్ల దర్శనం కోసం 7నెలలు ఆగవాల్సిందే.

ఇక ఆలయ విషిష్టత ఏంటంటే..

ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏడు నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు.  ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో 7 నెలలపాటు నీటిలో ఉండి.. కేవలం 5నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు.  వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం సంగమేశ్వర క్షేత్రం.  ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.  ఆత్మకూరు పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంత సమీపంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం … నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో… ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ధర్మరాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో గొప్ప విషయం ఏంటంటే.. వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

The Sangameshwara Temple

The Sangameshwara Temple

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

కర్నూలు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. ప్రధానంగా ఆత్మకురు నుండి సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. సొంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. తెలంగాణ నుంచి సోమశిల వచ్చి సోమశిల నుంచి పడవల్లో సంగమేశ్వరం చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.

Lord Shiva

Lord Shiva

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..