సంక్రాంతి.. కనుమ.. ముక్కనుమ విశిష్టత ఏంటి! ఆయా రోజుల్లో ఏం చేయాలో తెలుసా?
సంక్రాంతి సూర్యమాన ప్రకారం జరుపుకునే పండుగ. దక్షిణాయనంలో సంచరించిన సూర్యుడు ఈ రోజుతో ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. సూర్యుని గమన మార్పుతో వాతావరణంలోనూ మార్పులు వస్తాయి. ఈ కారణాల వల్లే సంక్రాంతిని పెద్ద పండుగగా, పెద్దల పండుగగా విశేషంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి నాలుగు రోజులపాటు జరుపుకునే పండగ.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. ప్రతి సంవత్సరం జనవరిలో ఈ పండుగను 4 రోజులపాటు అంటే బోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఈ నాలుగు రోజులను ఒక వేడుకలా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, బోగి మంటలు, పిల్లలపై భోగి పండ్లు పోయడం, గాలిపటాలు, కోడి పందాలు, కొత్త బట్టలు, చుట్టాలు, పిండివంటలతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలా పట్టణాల కంటే ఎక్కువగా పల్లెలు కళకళలాడతాయి.
సూర్యుడు ప్రతి నెలా ఒక రాశిలో ప్రవేశిస్తూ ఏడాది కాలంలో మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సందర్భాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రోజు దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల బాధలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.
సంక్రాంతి సూర్యమాన ప్రకారం జరుపుకునే పండుగ. దక్షిణాయనంలో సంచరించిన సూర్యుడు ఈ రోజుతో ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. సూర్యుని గమన మార్పుతో వాతావరణంలోనూ మార్పులు వస్తాయి. ఈ కారణాల వల్లే సంక్రాంతిని పెద్ద పండుగగా, పెద్దల పండుగగా విశేషంగా జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ
భోగి తర్వాత వచ్చే రోజున సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున ప్రతి ఇంటి ముందు పెద్ద రంగవల్లికలు వేస్తారు. ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి, వాటిని పూలతో అలంకరిస్తారు. ఆ గొబ్బెమ్మల చుట్టూ పిల్లలు, మహిళలు ఆనందంగా నృత్యాలు చేస్తారు. రంగురంగుల ముగ్గులతో గ్రామాలు, పట్టణాలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి.
హరిదాసులు ఇళ్ల వద్దకు హరినామ సంకీర్తనలు ఆలపిస్తారు. గంగిరెద్దుల వారు బసవన్నను ఆడిస్తూ పిల్లలను ఆశీర్వదిస్తారు. ప్రజలు పవిత్రంగా స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఈ రోజున పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు, పెద్దలు, ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పండుగగా సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది.
పంట పండుగగా సంక్రాంతి
సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చిన కొత్త ధాన్యం ఇంటికి చేరుతుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఎంతో ఆనందిస్తారు. కొత్త బియ్యం త్వరగా అరగవు కాబట్టి వాటితో నేరుగా అన్నం వండరు. బెల్లం కలిపి పరమాన్నం, అరిసెలు, అప్పాలు, చక్కిలాలు వంటి పిండి వంటలు తయారు చేస్తారు. ఇది ఆరోగ్యకరంగానూ ఉంటుంది. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం సమర్పిస్తారు. అందుకే అక్కడ ఈ పండుగను “పొంగల్” అని పిలుస్తారు. పంటను అందించిన దేవుడికి కృతజ్ఞతగా నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రకృతితో పాటు పశువులను కూడా పూజించడం ఈ పండుగ ప్రత్యేకత.
సంక్రాంతి పిండివంటల్లో నువ్వులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నువ్వులు, వాము కలిపి చేసిన చకినాలు ప్రత్యేకమని చెప్పవచ్చు. కొందరు నువ్వులను శనిదేవుని ప్రతీకగా భావిస్తారు. చాలా ప్రాంతాల్లో ఈ సమయంలో నువ్వుల వినియోగం ఆనవాయితీ. వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు సందడి చేస్తుంటారు. వీరికి తోచినంత సహాయం చేయడం భగవంతునికి చేసిన సేవగా భావిస్తారు.
కనుమ పండుగ
సంక్రాంతి తర్వాతి రోజున కనుమ పండుగను ప్రజలు విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులు పాడి పశువులను శుభ్రపరచి, అలంకరించి, కుంకుమ బొట్లు పెట్టి, పూల దండలు వేస్తారు. ప్రత్యేకమైన దాణా పెట్టి గోపూజ నిర్వహిస్తారు. పొలాల వద్ద రైతులు వండిన పులగాన్ని జల్లుతారు. ఇళ్లను మామిడి ఆకులు, పూల తోరణాలతో అందంగా అలంకరిస్తారు.
ముక్కనుమ పండుగ
సంక్రాంతి పండుగలో నాలుగో రోజు ముక్కనుమ. ఈ రోజున కొత్తగా పెళ్లైన మహిళలు గౌరీదేవి వ్రతం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి, ప్రతిరోజూ తొమ్మిది రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం అమ్మవారి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇళ్లలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. అలాగే ముక్కనుమ మాంసాహార ప్రియులకు ప్రత్యేకమైన పండుగ. మొదటి మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో శాఖాహారం మాత్రమే తీసుకోవడం సంప్రదాయం.
