AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షట్టిల ఏకాదశి ఉపవాస సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా? ఈ విషయం మర్చిపోకండి

హిందూ ధర్మంలో షట్టిల లేదా షట్తిల(షట్ అంటే ఆరు, తిల అంటే నువ్వులు) ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం సమయంలో నువ్వులను ముఖ్యంగా భావిస్తారు. ఈ రోజున ఏ ఆహారం తీసుకోవాలి? ఏ పదార్థాలు తినవద్దో తెలుసుకుందాం. నువ్వులు, నువ్వులతో చేసిన వంటకాలు, స్వీట్లు తినవచ్చు.

షట్టిల ఏకాదశి ఉపవాస సమయంలో ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా? ఈ విషయం మర్చిపోకండి
Shattila Ekadashi
Rajashekher G
|

Updated on: Jan 14, 2026 | 11:29 AM

Share

హిందూ పంచాంగం ప్రకారం.. షట్టిల లేదా షట్తిల ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైన పండగ ఉపవాసంగా పరిగణిస్తారు. 2026లో ఈ ఉపవాసం జనవరి 14న వస్తుంది. వచ్చింది. ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఉండటం వల్ల మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతాయి. అంతేగాక, ఆర్థిక శ్రేయస్సు, శుభ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఉపవాస సమయంలో తీసుకునే ఆహారంపై శ్రద్ద వహించాలి. తేలికైన, సాత్విక, నువ్వుల ఆధారిత ఆహారాలు మాత్రమే ఉపవాసం ఉన్న వ్యక్తులు తీసుకోవాలి. ఉపవాసం విరమించే సమయానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఇది అన్ని పుణ్య ఫలితాలను నిర్ధరిస్తుంది.

షట్టిల ఏకాదశి నాడు ఏం తినాలి?

షట్టిల లేదా షట్తిల(షట్ అంటే ఆరు, తిల అంటే నువ్వులు) ఏకాదశి ఉపవాసం సమయంలో నువ్వులను ముఖ్యంగా భావిస్తారు. ఈ రోజున భక్తులు నువ్వులు, నువ్వులతో చేసిన వంటకాలు, స్వీట్లు తినవచ్చు. ఇంకా తేలికపాటి శాఖాహార వంటకాలు, తాజా పండ్లు, పాలు, నెయ్యి కూడా ఉపవాసానికి శుభప్రదంగా భావిస్తారు. ఉపవాసం సమయంలో తీసుకునే ఆహారం సాత్వికమైనదిగా ఉండటం మంచిది. అంటే అందులో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, చేపలు లేదా ఘాటైన సుగంధ ద్రవ్యాలు ఉండకూడదు. నువ్వులను తినడం ఉపవాసంలో ఒక భాగం మాత్రమే కాదు.. సంపద, ఆనందం, సానుకూల శక్తికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఇంకా నువ్వుల ఆధారిత వంటకాలు శరీరం, మనస్సును సమతుల్యం చేస్తాయి. అంతర్గత బలాన్ని పెంచుతాయి. ఉపవాసం సమయంలో మానసిక స్థిరత్వాన్ని కాపాడుతాయి.

షట్టిల ఏకాదశినాడు ఏం తినకూడదు?

షట్టిల ఏకాదశ నాడు ఉపవాసం ఉండేవారు అపవిత్రమైన, భారీ ఆహారాన్ని తీసుకోరాదు. ఈరోజున మాంసం, చేపలు, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరపకాయ వంటి ఘాటైన సుగంధ ద్రవ్యాలు తీసుకోవడం నిషేధం. ఇంకా నూనె, కారంగా ఉండే వంటకాలు, అధికంగా వేయించిన ఆహారాలు కూడా ఉపవాసానికి అశుభకరమైనవిగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం.. ఈరోజున సరికాని ఆహారం.. గ్రహాలు, శక్తుల సానుకూల ప్రభావాన్ని బలహీనపరుస్తుంది. ఉపవాసం ప్రయోజనాలను తగ్గిస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండే వ్యక్తి రోజంతా తేలికైన, సాత్వికమైన, నువ్వుల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ రోజున సంయమనం, జాగ్రత్త పాటించడం చాలా ముఖ్యం.

ఉపవాసం ముగించేందుకు ఉత్తమ సమయం

షట్టిల ఏకాదశి ఉపవాసం ముగింపు ద్వాదశినాడు ఆచరించబడుతుంది. శాస్త్రాల ప్రకారం.. ఉపవాసం విరమించడానికి అత్యంత పవిత్రమైన సమయం తెల్లవారుజామున, సూర్యుడు ఉదయించే సమయం. ఈ సమయంలో ఉపవాసం ఉన్న వ్యక్తి తేలికపాటి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా నువ్వులు, పండ్లు, పాలతో చేసిన వంటకాలు ఉపవాసం విరమించడానికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఉపవాసం విరమించే ముందు మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ సమయంలో ఉపవాసం ఉన్న వ్యక్తి జపం, దానధర్మాలు, ఆధ్యాత్మిక సాధనల ఫలాలను పొందుతాడు. సరైన సమయంలో సరైన ఆహారం తినడం ద్వారా ఉపవాసం ఉన్న వ్యక్తి అన్ని మతపరమైన, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందగలరు. అందుకే ద్వాదశి ఉదయం ఉపవాసం విరమించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.