AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి..? దాని విలువ ఎంత.. ఎన్నేళ్లు వ్యాలిడ్..

ప్రామిసరీ నోట్లు అప్పుల లావాదేవీలకు చట్టబద్ధమైన ఆధారం. రెవెన్యూ స్టాంప్, వడ్డీ రేటు, తేదీ, సాక్షులు వంటి అంశాలు తప్పనిసరి. దీని చెల్లుబాటు కాలం కేవలం మూడు సంవత్సరాలు. ఈ కాలపరిమితిలోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పు వసూలుకు కోర్టు ద్వారా ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంది.

అసలు ప్రామిసరీ నోట్ అంటే ఏంటి..? దాని విలువ ఎంత.. ఎన్నేళ్లు వ్యాలిడ్..
Promissory Note
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2026 | 1:45 PM

Share

ప్రామిసరీ నోట్ అనేది ఆర్థిక లావాదేవీలలో రుణదాతకు చట్టబద్ధమైన భద్రతను అందించే ఒక కీలకమైన పత్రం. న్యాయ నిపుణులు దీని ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చెల్లుబాటు కాలంపై సమగ్ర వివరణ ఇచ్చారు. సాధారణంగా, వ్యక్తులు తమ వ్యక్తిగత అవసరాలు, వ్యాపార పెట్టుబడులు లేదా ఇతర ఆర్థిక కష్టాల కోసం ఇతరుల నుంచి అప్పులు తీసుకుంటారు. బ్యాంక్ రుణాలు అందుబాటులో లేనప్పుడు లేదా తక్షణ అవసరాల కోసం తెలిసిన వ్యక్తుల నుంచి చేబదులు తీసుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులలో అప్పు ఇచ్చిన వ్యక్తికి భద్రత కల్పించడానికి ప్రామిసరీ నోట్ ఉపయోగపడుతుంది. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైనా లేదా దురదృష్టవశాత్తు మరణించినా, ఈ నోట్ ద్వారా రుణదాతకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది.

రుణగ్రస్తుడి వారసుల నుంచి కూడా అప్పును వసూలు చేయవచ్చు, ఎందుకంటే వారసులు ఆస్తులతో పాటు అప్పులను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. ప్రామిసరీ నోట్ చెల్లుబాటు కావడానికి కొన్ని తప్పనిసరి నియమ నిబంధనలు పాటించాలి. నోట్‌లో స్పష్టమైన తేదీ, అప్పు ఇచ్చిన మొత్తం, వడ్డీ రేటు వివరంగా ఉండాలి. వడ్డీ రేటు న్యాయబద్ధంగా ఉండాలి; అధిక వడ్డీ రేట్లను కోర్టులు అంగీకరించకపోవచ్చు. అత్యంత ముఖ్యమైనది రెవెన్యూ స్టాంప్. ప్రామిసరీ నోట్‌పై రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపైనే సంతకాలు చేయాలి. స్టాంప్ లేకుండా రాసిన నోట్ చట్టబద్ధంగా చెల్లదు. కొంతమంది నోట్ వెనుక భాగంలో పాక్షిక చెల్లింపులను రాస్తుంటార. సరైన పత్రం ఉంటే కోర్టు వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రామిసరీ నోట్  చెల్లుబాటు కాలం రాసిన తేదీ నుంచి మూడు సంవత్సరాలు మాత్రమే. ఈ మూడు సంవత్సరాల లోపల రుణదాత అప్పు వసూలు చేయాలి లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మూడు సంవత్సరాల తర్వాత ప్రామిసరీ నోట్‌పై ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కావు. ఈ కాలపరిమితిని చాలామంది విస్మరిస్తుంటారు, తద్వారా తమ హక్కులను కోల్పోతుంటారు.

అప్పు వసూలు కోసం, రుణదాత సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు.  కేసు దాఖలు చేసేటప్పుడే, రుణగ్రస్తుడి ఆస్తులను అటాచ్మెంట్ (జప్తు) చేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించవచ్చు. కోర్టు పత్రాలను పరిశీలించిన తర్వాత, ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేయడానికి ఆదేశించవచ్చు. కేసు గెలిచినట్లయితే, న్యాయబద్ధమైన మొత్తాన్ని ఆ ఆస్తులను అమ్మి వసూలు చేసుకోవచ్చు. అప్పు మొత్తం చిన్నదైనా, పెద్దదైనా ఈ ప్రక్రియ వర్తిస్తుంది. అయితే, చిన్న మొత్తాల కోసం లీగల్ ఖర్చులు, సమయం ఎక్కువ అవుతాయి కాబట్టి చాలామంది ఆసక్తి చూపరు. ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఇద్దరు సాక్షులు తప్పనిసరి. 18 సంవత్సరాలు నిండిన, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా సాక్షులుగా ఉండవచ్చు. అప్పు తిరిగి చెల్లించడంలో రుణగ్రహీత విఫలమైతే, సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పగలగాలి. గ్యారంటీదారులు కూడా ప్రామిసరీ నోట్‌లో ఒక ముఖ్యమైన భాగం. అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పక్షంలో, గ్యారంటీదారుల నుంచి అప్పును వసూలు చేసుకోవచ్చు. గ్యారంటీదారుడి సంతకం అంటే, రుణగ్రహీత కట్టకపోతే తాను చెల్లిస్తానని హామీ ఇచ్చినట్లే. సరైన జాగ్రత్తలు, చట్టబద్ధమైన నియమాలను పాటిస్తూ ప్రామిసరీ నోట్ రాసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు, అప్పుల లావాదేవీలను సురక్షితం చేసుకోవచ్చు.

(ఈ సమాచారం న్యాయ నిపుణుల నుంచి సేకరించాం)

Also Read: తక్కువ ఖర్చుతో కోళ్లకు మేతగా పురుగులు ఇలా తయారు చేస్కోండి 

Follow Us