పూజలో గంట మోగిస్తున్నారా? ఈ 7 నియమాలు తెలియకపోతే పూజ ఫలితం తగ్గుతుందట!
Bell Ringing In Puja: సనాతన ధర్మంలో పూజ సమయంలో గంట మోగించడం పవిత్రమైన ఆచారం. దేవతలను ఆహ్వానించడం నుంచి హారతి వరకు గంటకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. గంటను ఎన్నిసార్లు మోగించాలి, ఎప్పుడు మోగించకూడదు, పూజ గదిలో ఎలా ఉంచాలి వంటి ముఖ్యమైన నియమాలు, గంట నాదం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోండి.

సనాతన ధర్మంలో పూజా కార్యక్రమాల్లో గంటకు ప్రత్యేక స్థానం ఉంది. ఆలయాల్లో హారతి సమయంలోనూ, ఇంటి పూజా మందిరంలోనూ గంట మోగించడం అనాదిగా వస్తున్న ఆచారం. గంట నాదం దేవతలను ఆహ్వానిస్తుందని, చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని విశ్వసిస్తారు. అందుకే పూజ సమయంలో గంట మోగించడం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రియగా పరిగణించబడుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, గంట ధ్వని మనస్సును ఏకాగ్రం చేయడంలో సహాయపడుతుంది. అలాగే పూజలో పాల్గొనే వారి దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి దీనికి ఉందని చెబుతారు. ఇంటి పూజా గదిలో అయినా, ఆలయంలో అయినా గంటను ఉపయోగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం శ్రేయస్కరంగా భావిస్తారు.
పూజలో గంట మోగించే ముఖ్య నియమాలు
1. పూజ ప్రారంభంలో గంట మోగించాలి
హిందూ శాస్త్రాల ప్రకారం, పూజ ప్రారంభించే ముందు గంటను ఒకసారి మోగించడం ద్వారా దేవతలను ఆహ్వానించినట్లుగా భావిస్తారు. అనంతరం హారతి సమయంలో గంటను లయబద్ధంగా మోగించడం సంప్రదాయం.
2. నైవేద్యం సమర్పించేటప్పుడు గంట నాదం
దేవతలకు నైవేద్యం సమర్పించే సమయంలో గంట మోగించడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల పంచభూతాలు మేల్కొని, సమర్పించిన ఆహారం పవిత్రతను పొందుతుందని విశ్వాసం.
3. గంటను బేసి సంఖ్యలో మోగించాలి
గంటను మోగించేటప్పుడు ఒకసారి, మూడు సార్లు లేదా ఐదు సార్లు మోగించడం శుభకరంగా పరిగణిస్తారు. సాధారణంగా రోజువారీ పూజల్లో కనీసం మూడు సార్లు గంట మోగించే ఆచారం ఉంది. బేసి సంఖ్యలు ఆధ్యాత్మికంగా శుభసూచకంగా భావించబడతాయి.
4. రాత్రివేళ గంట మోగించరాదు
కొన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం, దేవతలు విశ్రాంతి తీసుకునే సమయంగా భావించే అర్ధరాత్రి లేదా నిశీథ సమయంలో గంట మోగించడం నివారించాలి. అయితే ఆలయ సంప్రదాయాలు ప్రాంతానుసారం మారవచ్చు.
5. గంటను శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి
పూజలో ఉపయోగించే గంటను ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. ఉపయోగించిన తర్వాత దానిని పూజా మందిరంలో కేటాయించిన స్థానంలోనే ఉంచడం మంచిది. ఎక్కడపడితే అక్కడ ఉంచడం లేదా నేలపై పడేయడం శాస్త్రోక్తం కాదు.
6. అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు
గంట పవిత్రమైన పూజా సామగ్రిలో ఒకటి. కాబట్టి మురికి లేదా అపరిశుభ్రమైన చేతులతో దానిని తాకకూడదు. పూజకు ముందు చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
7. విరిగిన గంటను ఉపయోగించవద్దు
పగిలిన లేదా దెబ్బతిన్న గంటను పూజల్లో ఉపయోగించరాదని శాస్త్రాలు సూచిస్తాయి. గంట నుంచి వెలువడే నాదం స్వచ్ఛంగా ఉండటమే దాని ప్రధాన ఉద్దేశం. అందువల్ల దెబ్బతిన్న గంటను మార్చడం మంచిది.
గంట నాదం వల్ల కలిగే ప్రయోజనాలు
ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, గంట ధ్వని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. అలాగే మనసులోని చెడు ఆలోచనలను తొలగించి, ఏకాగ్రతను పెంచుతుందని చెబుతారు. కొన్ని అధ్యయనాల ప్రకారం గంట నాదం వల్ల శబ్ద తరంగాలు పరిసరాల్లోని నిశ్శబ్దాన్ని ఛేదించి, మనసుకు ప్రశాంతతను కలిగించడంలో సహాయపడవచ్చు. అందుకే పూజలో గంట మోగించడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. భక్తి, ఏకాగ్రత, పవిత్రతకు ప్రతీకగా కూడా భావించబడుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




