Andhra Pradesh: మైసూరు తరువాత ఒంగోలులోనే దసరా సందడి..! అంతటి స్పెషల్‌ ఏంటంటే..

దసరా ఉత్సవాల్లో ఒంగోలు నగరానికే హైలెట్‌గా నిలిచే కళారాల ఉత్సవాలు 4 వందల ఏళ్ళుగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతారు... అయితే అంతకు ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని భావిస్తారు... అప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓ ప్రత్యేకమైన సాంప్రదాయంగా దసరా పండుగ సంబరాల్లో

Andhra Pradesh: మైసూరు తరువాత ఒంగోలులోనే దసరా సందడి..! అంతటి స్పెషల్‌ ఏంటంటే..
Kalarala Sambaram
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 11, 2024 | 8:45 PM

దసరా పండుగ సందర్బంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కళారాల ఊరేగింపునకు ఓ ప్రత్యేకత ఉంది… మైసూరు, కలకత్తాల తరువాత ఒక్క ఒంగోలులోనే ఈ విధమైన కళారాలను ప్రదర్శిస్తారు… దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి.. భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన అమ్మవారు… అదే రౌద్ర రూపంతో ఊరేగింపునకు బయల్దేరుతుంది…

దసరా ఉత్సవాలు దక్షిణభారతదేశంలోనే ఒంగోలులో ప్రత్యేకంగా జరుగుతాయి. నవమి రోజున నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించటం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అమ్మవార్ల కళారాల ఊరేగింపు కమనీయంగా సాగింది. ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికమ్మ, పసుపువర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గమ్మ, తెలుపువర్ణంలో బీవీఎస్‌ హాలు దగ్గరున్న నరసింహస్వామి కళారాలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగాయి. మైసూరు, కలకత్తాల తరువాత ఒంగోలు నగరంలో మాత్రమే ఈ కళారాల ప్రదర్శన జరగుతోంది… 4 వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి- అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన. అన్నీ ఒకచోట.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరతారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తి స్తుంటారు. నృత్యాలు చేసేవారు, కాళికాంబ వేషధారణతో…. కోలాహలమంతా ఇక్కడే కొలువుంటుంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించడం తమ అదృష్టమని భావిస్తారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూస్తారు… మరుసటి రోజు ఉదయానికి అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకుంటాయి. టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకుంటారు భక్తులు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమికూడతారు. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకంగా ఉంటుందని ఆలయ పూజారులు, నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

దసరా ఉత్సవాల్లో ఒంగోలు నగరానికే హైలెట్‌గా నిలిచే కళారాల ఉత్సవాలు 4 వందల ఏళ్ళుగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతారు… అయితే అంతకు ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని భావిస్తారు… అప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓ ప్రత్యేకమైన సాంప్రదాయంగా దసరా పండుగ సంబరాల్లో కళారాలను ప్రదర్శించడం గొప్పవిషయమే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..