Nagoba Jatara: నాగోబా జాతరకు సర్వం సిద్దం.. వైభవంగా జరుగుతున్న ఆలయ ప్రారంభోత్సవ పూజలు

ఈనెల 26వ తేదీన కేస్లాపూర్‌లోని నాగోబా జాతర పూజలు నిర్వహించి  7 రోజుల పాటు జాతర ఉత్సవాలను వివరించే ప్రచార రథాన్ని సైతం సిద్దం చేశారు. జనవరి నెలలో పుష్యమి అమావాస్య రోజున నాగోబా దేవుడికి మహాపూజలతో జాతరం ప్రారంభం కానుంది.

Nagoba Jatara: నాగోబా జాతరకు సర్వం సిద్దం.. వైభవంగా జరుగుతున్న ఆలయ ప్రారంభోత్సవ పూజలు
Nagoba Jarata
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2022 | 2:18 PM

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటైన నాగోబా జాతరకు అంతా సిద్దం చేస్తున్నారు మెస్రం వంశస్తులు. ఇందుకోసం అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ పూజలు ప్రారంభించారు. ఆదివాసీల ఆరాధ్య దేవుడు నాగోబాకు మెస్రం వంశస్థులు 5 కోట్లతో నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవ పూజలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన మెస్రం వంశస్థుల సమక్షంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, ఆయన భార్య లక్ష్మి నవగ్రహ పూజలు చేశారు. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే నాగోబా ఆలయ ప్రారంభోత్సవ పూజలతో పాటు.. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం నుంచి తీసుకువచ్చిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను, ఆదివాసీ గిరిజన తెగలోని మహరాజ్‌లు వేదమంత్రాల మధ్య నిర్వహించనున్నారు. అంతకుముందు పూజారులు మెస్రం కోసురావు, మెస్రం హన్మంత్‌రావు గంగా జలంతోపాటు ఆవు పాలతో నూతనంగా నిర్మించిన ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెస్రం వంశస్థుల యువకులు నాగోబా యువ సేనా పేరుతో సౌకర్యాలను కల్పిస్తున్నారు. భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో మెస్రం వంశం పటేల్‌.. మెస్రం చిన్ను, ప్రధాన్‌ మెస్రం దాదేరావు, కొత్వాల్‌ మెస్రం తిరుపతి, మెస్రం వంశం ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మెస్రం సోనేరావు, ప్రధాన కార్యదర్శి మెస్రం దేవురావులతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్‌, యావత్మాల్‌ జిల్లాల పరిధిలోని మెస్రం వంశస్థులు, ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీన కేస్లాపూర్‌లోని నాగోబా జాతర పూజలు నిర్వహించి  7 రోజుల పాటు జాతర ఉత్సవాలను వివరించే ప్రచార రథాన్ని సైతం సిద్దం చేశారు. జనవరి నెలలో పుష్యమి అమావాస్య రోజున నాగోబా దేవుడికి మహాపూజలతో జాతరం ప్రారంభం కానుంది. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత.  పుష్యమి అమావాస్య రోజున తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం.  పాలు తాగి తమని ఆశీర్వదిస్తారని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి