Mystery Temple: ఈ ఆలయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ప్రమాదాలను నివారించే బులెట్ బాబా టెంపుల్ ఎక్కడంటే..
రాజస్థాన్‌లో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ దేవుని స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను పూజిస్తారు. స్థానిక ప్రజలు ఈ ఆలయాన్ని 'బుల్లెట్ బాబా ఆలయం' అని పిలుస్తారు. ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు.
రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉన్న ఓ ఆలయం ఇతర ఆలయాల కంటే భిన్నం. ఎందుకంటే ఇక్కడ ఏ దేవతలు, దేవుళ్ళు పూజలను అందుకోరు. ఇక్కడ ఉన్న ఆలయంలో బుల్లెట్ పూజలను అందుకుంటుంది. అందుకనే ఈ ఆలయం “బుల్లెట్ బాబా ఆలయం” పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఇతర దేవాలయాల కంటే పూర్తిగా భిన్నమైనది. ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇక్కడ ఏ దేవత పూజించబడదు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్ పూజలను అందుకుంటుంది. ఈ ఆలయ కథ రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. ఈ ఆలయం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రద్దీతో సందడి సందడిగా ఉంటుంది. ఈ ప్రసిద్ధి చెందిన బుల్లెట్ బాబా టెంపుల్ గురించి తెలుసుకుందాం..
ఈ ఆలయ నిర్మాణం వెనుక కథ ఏమిటంటే
ఈ ఆలయం వెనుక ఆసక్తికరమైన, భావోద్వేగ కథ ఉంది. ఇది 1988లో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఓం సింగ్ రాథోడ్ (స్థానికంగా ‘ఓం బన్నా’ అని పిలుస్తారు) తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్నాడు.. అతను పాలి నుంచి కొంత దూరంలో ప్రమాదానికి గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అతని బుల్లెట్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తాళం వేశారట. అయితే ఆశ్చర్యకరంగా మోటారుసైకిల్ స్వయంగా రాధోడ్ కు ప్రమాదం జరిగిన స్పాట్‌కు తిరిగి వచ్చింది. ఇలా చాలాసార్లు పోలీసు స్టేషన్‌కు ఆ బైక్ ను తీసుకెళ్ళారు. అయితే ప్రతిసారీ ఈ అద్భుతం పునరావృతమైంది. దీని తరువాత స్థానిక ప్రజలు దీనిని దైవికమైన సంఘటనగా భావించారు. అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించి ఓం బన్నా ను అతని బుల్లెట్‌ను పూజించడం ప్రారంభించారు.
ఆలయంలో విశిష్టమైన సంప్రదాయం
ఈ ఆలయానికి వచ్చే ప్రజలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ను పూజిస్తారు. గౌరవ సూచకంగా పువ్వుల దండ, కొబ్బరికాయ, మద్యాన్ని సమర్పిస్తారు. ముఖ్యంగా ప్రయాణికులు, బైక్ రైడర్స్ ఇక్కడ ఆగి తమకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడమంటూ భద్రత కోసం పూజలు, ప్రార్థనలు చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఓం బన్నా తమ ప్రయాణాన్ని సురక్షితంగా , ఎటువంటి అవాంతరాలు లేకుండా చేస్తుందని నమ్ముతారు. ఈ ఆలయానికి వచ్చి బుల్లెట్ బాబాను ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది వస్తుంటారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.