Maha Shivaratri: శివాలయాల అద్భుత రహస్యాలు..! ఈ ఆలయాల మిస్టరీలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!
మన దేశంలో పూర్వ కాలం నుంచి అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శివాలయాలు ఎన్నో రహస్యాలను కలిగి ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ జరిగే కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు, నిపుణులు అర్థం చేసుకోలేకపోతున్నారు. మహాశివరాత్రి సమీపిస్తున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మిస్టరీలతో కూడిన శివాలయాల గురించి తెలుసుకుందాం.
Updated on: Feb 23, 2025 | 9:55 AM

మహాశివరాత్రి పండుగ వేళ కోటప్పకొండ భక్తులతో కళకళలాడుతుంది. ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్నాడు. ఈ కొండలో ఓ విశేషం ఉంది. ఇక్కడ ఒక్క కాకి కూడా కనిపించదు. మీరు ఎక్కడికైనా వెళ్లినా కాకులు ఉంటాయి. కానీ కోటప్పకొండ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ కొండను ఏ దిశ నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వర క్షేత్రంగా పిలుస్తారు.

కోటప్పకొండ క్షేత్రంలో శివుడు బ్రహ్మచారి స్వరూపంలో ఉండటంతో ఇక్కడ అమ్మవారి ఆలయం ఉండదు. అదే కారణంగా ఈ దేవాలయంలో పెళ్లిళ్లు జరగవు. జాతకంలో గురు బలం పెంచుకోవాలనుకునే వారు ఇక్కడ పూజలు చేస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామం వద్ద ఉంది.

యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి తెలుగువారు వినే ఉంటారు. ఈ ఆలయం పరిసరాల్లో కూడా కాకులు కనిపించవు. పురాణ కథ ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో కాకులు కలత కలిగించాయి. అందుకే ఆయన శాపం వల్ల అక్కడ కాకులు సంచరించలేవు.

యాగంటి ఆలయంలో ఉండే నంది విగ్రహం ప్రతీ ఏటా స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది. దీని వెనుక గల రహస్యాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోతున్నారు. కాలజ్ఞానం ప్రకారం కలియుగాంతంలో ఈ నంది విగ్రహం ప్రాణం పొంది ముందుకు కదిలిపోతుందని చెబుతారు. ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో ఉంది.

తెలంగాణలోని నల్గొండలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయంలో ఓ విశేషం ఉంది. ఈ ఆలయంలోని శివలింగం వెనుక ఎల్లప్పుడూ నీడ కనిపిస్తుంది. దీని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు.

నల్లమల అడవుల్లో మహర్షులు తపస్సు చేసిన ప్రదేశంలో ఉమామహేశ్వర ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అంతేకాదు ఏ కాలంలోనైనా 365 రోజులూ నిరంతరంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఆలయం నాగర్ కర్నూలు జిల్లాలోని మన్ననూర్ గ్రామంలో ఉంది.





























