Bhishma Niti: ఉన్నత పదవులను దుర్మార్గులకు ఇస్తే ఏ విధమైన పరిమాణాలు ఏర్పడతాయో భీష్ముడు చెప్పిన కథ

Bhishma Niti: ఉన్నత పదవులను దుర్మార్గులకు ఇస్తే ఏ విధమైన పరిమాణాలు ఏర్పడతాయో భీష్ముడు చెప్పిన కథ
Bhishmudu

Mahabharata-Bhishma Niti: రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక గ్రంథాలు మంచిచెడుల గురించి చెబుతూ.. ఓ వైపు మనిషి నడవడి ఎలా ఉండాలో సూచిస్తాయి. అంతేకాదు మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తాయి..

Surya Kala

|

Sep 20, 2021 | 6:43 AM

Mahabharata-Bhishma Niti: రామాయణం, మహాభారతం వంటి పౌరాణిక గ్రంథాలు మంచిచెడుల గురించి చెబుతూ.. ఓ వైపు మనిషి నడవడి ఎలా ఉండాలో సూచిస్తాయి. అంతేకాదు మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియచేస్తాయి. భారతంలోని శాంతిపర్వంలో ఇలాంటి హృద్యమైన కథలు అనేకం కనిపిస్తాయి. కురుక్షేత్రం యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో పాండవులకు హితభోధనలు కథలుగా చెప్పాడు. ముఖ్యంగా ధర్మరాజు పరిపాలన లో రాజుకుండాల్సిన లక్షణాలు, రాజు పాటించాల్సిన ధర్మం గురించి చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథలు సాగుతాయి. ఈరోజు రాజు ఉన్నత పదవుల్లో ఎటువంటి వారిని నియమించాలో భీష్ముడు చెప్పిన కథ గురించి తెలుసుకుందాం..

పాండవుల అగ్రజుడు ధర్మరాజుకి.. ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి.. అన్న అనుమానం వచ్చింది. ఇదే విషయాన్నీ అంపశయ్య మీద ఉన్న భీష్మపితామహుడిని అడుగుతూ.. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు.

‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండటా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే.. ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది. ‘‘వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటం వల్లే కదా, దానికి ఆపద కలిగింది- అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. యథాప్రకారం పులిరూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు.

‘‘ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులిలా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది- ‘మునివర్యులు నా మీద జాలిచూపారు కాబట్టి, నన్ను అన్నింటికంటే శక్తిమంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణువేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా!’ అనుకుంది. ‘అసలు ఆ మునీశ్వరుని చంపిపారేస్తే, అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదు,’ అని పన్నాగం పన్నింది. ‘‘కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులిగా మార్చినవాడు, దాని మనసులో ఏముందో గ్రహించలేడా.. మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు.. అది పూర్వంలాగే కుక్కబతుకుని గడపసాగింది. ‘‘కాబట్టి ధర్మనందనా! దుర్మార్గులకు ఉన్నతపదవులని ఇస్తే, వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నయినా సాధించగలడు,’’ అని భీష్మపితామహుడు. ధర్మజునికి తెలిపాడు.

Also Read:

సునామీ కూడా తాకని సుబ్రమణ్య స్వామి టెంపుల్.. ఇక్కడ విభూతికి రోగాలను తగ్గిస్తుందని నమ్మకం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu