Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mayuura Dhvaja: తన శరీరంలోని సగభాగం ఇచ్చి పరోపకారం త్యాగనిరతిని గురించి చెప్పిన ధీరుడు.. పాండవులను ఓడించిన వీరుడు

Mayuura Dhvaja:పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం .. నేటీ మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది..

Mayuura Dhvaja: తన శరీరంలోని సగభాగం ఇచ్చి పరోపకారం త్యాగనిరతిని గురించి చెప్పిన ధీరుడు.. పాండవులను ఓడించిన వీరుడు
Mayura Dhwaja
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2021 | 9:32 AM

Mayuura Dhvaja:పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం .. నేటీ మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, కర్ణుడు, భీష్ముడు, శకుని, ద్రౌపతి, కుంతి ఇలా అనేకమంది ఉన్నారు. స్త్రీ, పురుషుల జీవితాలను తరచి చూస్తే మనకు జీవితంలో మంచి చెడులు అర్ధమవుతాయి. ఈరోజు మహాభారతంలోని గొప్ప వ్యక్తి మయూరధ్వజుడు గురించి అతని త్యాగ నిరతి గొప్పదనం గురించి తెలుసుకుందాం..

ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తూ.. యాగాశ్వాన్నివిడిచాడు. ఆ యావశ్వాన్ని వీర ధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించడానికి మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి శ్రీ కృష్ణార్జునులు వచ్చారు. శ్రీ కృష్ణుడు.. అర్జునుని ప్రార్థనపై మయూరధ్వజుడుతో యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు.

దీంతో అర్జునుడు యాగాశ్వం సంపాదించడానికి .. మయూరధ్వజుడిని సంహరించాల్సి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు “ఫల్గుణా.. నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. అతని ధర్మబుద్ధి నీకు చెబుతా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు శ్రీ కృష్ణుడు.

మర్నాడు శ్రీ కృష్ణార్జునులు బ్రాహ్మణుల వేషంలో మయూరధ్వజుని వద్దకు అతిథులుగా వెళ్లారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విన్న శ్రీకృష్ణుడు “రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చింది. అది తీరిన తరువాతే మేము ఇంకొక విషయం పై దృష్టిపెడతాం అని అన్నాడు. దీంతో మయూరధ్వజుడు మీ కష్టం ఏమిటి చెప్పండి.. నాకు చేతనైన సాయం చేస్తా అని అడిగాడు. దీంతో “రాజా.. మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది “మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు”. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను” అని మారు వేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు చెప్పాడు.

దీంతో మయూరధ్వజు “ఆహా.. ఈరోజు కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి” అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇవ్వమని చెప్పాడు. అతని అర్ధాంగి తన భర్త ఇలా చేయమన్నాడు అంటే.. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో చేయమని వుంటాడని గ్రహించి తన బాధను దిగమింగుకుంది. వెంటనే మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణార్జులకు ఒక దృశ్యం కనిపించింది.

మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీరు కారుతుంది. దీంతో శ్రీ కృష్ణుడు రాజా “రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా, మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వమని చెప్పాడు. విప్రుడు మాటలకు మయూరధ్వజుడు స్పందిస్తూ.. అయ్యా .. నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతుంది. ఎడమ భాగ శరీరం “నాకా అదృష్టం లేదే” అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ” అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం దర్శనం ఇచ్చి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడయ్యాడు.

ఈ కథలోని నీతి:

మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషంగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు. అతని త్యాగనిరతితో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు.

Also Read: సీసీ టీవీ ధ్వంసం చేసి మరీ ఏటీఎంలో దొంగతనం చేసిన దుండగులు.. ఎక్కడంటే