Mahalaxmi Temple: అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠం కొల్హాపూర్‌ శ్రీమహాలక్ష్మీ ఆలయం మహిమాన్వితం!

సమస్త మానవాళికి శక్తిని... ఉత్సాహాన్ని... ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు.

Mahalaxmi Temple: అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠం కొల్హాపూర్‌ శ్రీమహాలక్ష్మీ ఆలయం మహిమాన్వితం!
Kolhapur Ambabai Mahalaxmi Temple
Follow us

|

Updated on: Mar 24, 2022 | 10:01 AM

Kolhapur Ambabai Mahalaxmi temple: లక్ష్మీదేవి ఆలయమంటే మనకు చటుక్కున స్ఫురించేది మహారాష్ట్ర(Maharashtra)లోని కొల్హాపూర్‌ శ్రీమహాలక్ష్మీ ఆలయమే(Sri Maha Laxmi Temple)! అల వైకుంఠ పురిలో ఉన్న అమ్మవారు భక్తుల కోసం ఇలపై వెలిసిన క్షేత్రమే కొల్హాపూర్‌ అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠంగా విరాజిల్లుతోంది. సతీదేవికి చెందిన నయనాలు ఈ క్షేత్రంలో పడ్డాయన్నది పురాణగాధ. మనదేశంలో ఉన్న లక్ష్మీదేవి ఆలయాలలో అగ్రభాగాన నిలుస్తుందీ ఆలయం! అయితే, ఇవాళ తెలంంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కుటుంబసమేతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సాయంత్రం తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

అరుదైన శిలపై చెక్కిన అమ్మవారి విగ్రహ రూపం ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది.. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న ఆ శ్రీదేవిని రూపాన్ని దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్టేననుకుంటారు భక్తులు.. ఫలం..గద…కవచం.. పాత్రను నాలుగు చేతుల్లో కలిగి ఉన్న ఆ దివ్యమంగళరూపాన్ని ఎంత సేపు చూసినా తనివి తీరదు.. స్థానికులు అంబాబాయిగా పిల్చుకునే లక్ష్మీదేవి భక్తులకు సదా ఆశీర్వచనాలు ఇస్తుంటుంది.

మహావిలయంలోనూ ఈ క్షేత్రం చెక్కుచెదరదు కాబట్టే ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహరిస్తారు. ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షిస్తే.. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మీ అమ్మవారు తన కరములతోపైకి ఎత్తిందట! అందుకే ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందట! ఈ మందిరానికి అవిముక్తేశ్వర క్షేత్రమని కూడా పేరుంది.. వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు తపమాచరించినట్టు..అమ్మవారికి పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి..

సమస్త మానవాళికి శక్తిని… ఉత్సాహాన్ని… ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి రజోగుణాధీశ్వరి. ఆమె ఈ సృష్టినంతటినీ శాసిస్తున్న పరమేశ్వరి. ఆమె శక్తి అంశ. ఆ కారణంగానే భక్తులు మహాలక్ష్మిని నిత్యం పూజిస్తారు. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు తన హృదయంలో నిలుపుకుంటాడు.. నారాయణిగా పేరుగాంచిన ఆ సిరి దేవత ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపదలకు లోటు ఉండదు.. స్వయంగా లక్ష్మీదేవి తపమాచరించి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకే ఇక్కడ పేదరికం ఉండదట!

ఈ క్షేత్రానికి ఒకటిరెండు స్థలపురాణాలు కూడా ఉన్నాయి. ఆగస్త్యమహాముని ప్రతి ఏటా కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకునేవాడు.. వయసుమీరిన తర్వాత ఆగస్త్యుడికి కాశీకి వెళ్లడం కష్టమయ్యింది.. దాంతో శివుడి గురించి తపస్సు చేశాడు.. శివుడు ప్రత్యక్షమై….వరం కోరుకోమన్నాడు.. కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రాన్ని చూపించాలని వేడుకుంటాడు ఆగస్త్యుడు.. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారని.. ఆ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీలో తనను దర్శించుకున్నంత ఫలమని శివుడు చెబుతాడు.. పరమేశ్వరుడి ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని స్థలపురాణం చెబుతోంది. ఈ నగరానికి కోల్‌పూర్ … కోల్‌గిరి … కొలదిగిరి పట్టణ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. . కొల్లా అంటే లోయ! పూర్‌ అంటే పట్టణం. ఈ క్షేత్ర ప్రాంతం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో ఎంతగానో అభివృద్ధి చెందింది..

సూర్యభగవానుడు లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి సంవత్సరం మూడు రోజులు గర్భాలయంలోకి తన కిరణాలను ప్రసరింపచేస్తాడు. మొదటి రోజు పాదాలపై.. రెండో రోజు నడము భాగంపై… మూడో రోజు శిరస్సుపై కిరణాలు ప్రసరిస్తాయి.. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా పిలుస్తారు.. ఈ మూడు రోజులపాటు అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు వస్తారు. సూర్యగ్రహణం రోజున మూడున్నర కోట్ల తీర్థాలు ఇక్కడ కొలువై ఉంటాయట! ఆ రోజున ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే పంచమహాపాతకాలు కూడా ప్రక్షాళనమవుతాయట! ఈ క్షేత్రానికి అన్ని దిక్కులా పుణ్యతీర్థాలు ఉండటం విశేషం. ఆది శంకరాచార్యలు కూడా కొల్హాపూర్‌ ఆలయాన్ని సందర్శించి శ్రీచక్రాన్ని స్థాపించారట!

Read Also…. 

CM KCR Kolhapur Visit: ఇవాళ మరోసారి మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. కొల్హాపూర్‌ అమ్మవారికి కుటుంబసమేతంగా పూజలు!