Maha Kumbha: రేపటి నుంచి మహా కుంభ ప్రారంభం.. మొదటి రాజ స్నానం శుభ ముహర్తం, నియమాలు ఏమిటంటే..
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభకు వేళయింది. మరి కొన్ని గంటల్లో అంటే జనవరి 13వ తేదీన మహా కుంభ మొదలు కానుంది.. రేపు మొదటి షాహి స్నానం చేయనున్నారు. 12 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ జాతరలో దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనబోతున్నారు. మహాకుంభానికి ముందు రాజస్నానానికి సంబంధించిన శుభ సమయం, నియమాల గురించి తెలుసుకుందాం.
ప్రయాగ్‌రాజ్‌లో రేపటి నుంచి మహాకుంభ ప్రారంభంకానుంది. హిందూ మతంలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహాకుంభానికి ప్రత్యేక మతపరమైన, ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. ఇక్కడ గంగా, యమునా నదులతో పాటు అంతర్వాహిగా సరస్వతీ నదుల సంగమం జరుగుతుంది. అందుకనే ఈ నదిని ‘త్రివేణి సంగమం’ అంటారు. భారతదేశంలోని నాలుగు ప్రదేశాలలో మహాకుంభ ను నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్. ఋషులు, సాధువులు, భక్తులు ఈ పుణ్యక్షేత్రాలలో జరిగే మహా ఉత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. మహాకుంభంలోని త్రివేణి ఘాట్ వద్ద స్నానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుదని.. ఆత్మ, శరీరం రెండూ శుద్ధి అవుతాయని నమ్మకం. దీనితో పాటు ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ షాహి స్నాన్ పేరును అమృత స్నానం, నగర ప్రవేశంగా మార్చారు.
మొదటి రాజ స్నానానికి అనుకూలమైన సమయం. మహాకుంభ 2025 రేపు ప్రారంభం కానుంది. పుష్య మాసం పౌర్ణమి తిథి రోజున మహాకుంభం మొదటి రాజ స్నానం చేయనున్నారు. వేద పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి జనవరి 13 సోమవారం ఉదయం 5.03 గంటలకు ప్రారంభమవుతుంది. తేదీ జనవరి 14 మధ్యాహ్నం 3:56 గంటలకు ముగుస్తుంది. మొదటి రాజ స్నాన శుభ ముహూర్తాలు ఇలా ఉన్నాయి.
బ్రహ్మ ముహూర్తం- ఉదయం 5.27 నుంచి 6.21 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం- మధ్యాహ్నం 2:15 నుంచి 2:57 వరకు ఉంటుంది సంధ్యా సమయం – ఇది సాయంత్రం 5.42 నుంచి 6.09 వరకు ఉంటుంది నిశిత ముహూర్తం- 12:03 నుంచి 12:57 వరకు ఉంటుంది.
మహా కుంభలో ఇతర రాజ స్నానాల తేదీ లు
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే మహాకుంభలో రేపు తొలి రాజ స్నానం చేయనున్నారు. దీని తరువాత ఇతర రాజ స్నానాల తేదీలు క్రింది విధంగా ఉన్నాయి.
రెండవ రాజ స్నానం మకర సంక్రాంతి, 14 జనవరి 2025 రోజున జరుగుతుంది . మూడవ రాజ స్నానం 2025 జనవరి 29న మౌని అమావాస్య రోజున జరుగుతుంది . నాల్గవ షాహి స్నానం వసంత పంచమి, 3 ఫిబ్రవరి 2025 నాడు జరుగుతుంది. ఐదవ రాజ స్నానం మాఘ పూర్ణిమ, 12 ఫిబ్రవరి 2025 నాడు జరుగుతుంది. 2025 ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు చివరి రాజ స్నానం జరుగుతుంది.
రాజ స్నానం చేయడానికి నియమాలు
మహాకుంభంలో రాజ స్నానానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. నాగ సాధువులు మహాకుంభంలో ముందుగా స్నానం చేస్తారు. నాగ సాధువులు స్నానానికి ప్రాధాన్యత ఇవ్వడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. దీని వెనుక మత విశ్వాసం ఉంది. అంతేకాదు కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు మహాకుంభ స్నాన నియమాలు భిన్నంగా ఉంటాయి. గృహస్తులు నాగ సాధువుల తర్వాతే సంగమంలో స్నానం చేయాలి. స్నానం చేస్తున్నప్పుడు ఐదు సార్లు మునగాలి. అప్పుడు మాత్రమే స్నానం పూర్తయినట్లు పరిగణించబడుతుంది. స్నానం చేసేటప్పుడు సబ్బు లేదా షాంపూ ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది పవిత్ర జలాన్ని కలుషితం చేస్తుంది.
ఈ ప్రదేశంలో తప్పక దర్శించాల్సిన ప్రదేశాలు
మహాకుంభంలో రాజ స్నానం..దానం తర్వాత ఖచ్చితంగా బడే హనుమంతుడు, నాగవాసుకి దర్శనం చేసుకోవాలి. రాజ స్నానం తర్వాత ఈ రెండు దేవాలయాలలో దేనినైనా సందర్శించక పోతే మహాకుంభం ఆధ్యాత్మిక యాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.