Mahabharat Moral Story: గృహస్థ ధర్మం అంటే ఏమిటి.. సంసారం బంధాలను అధిగమించాలంటే ఏమి చెయ్యాలో చెప్పిన శౌనకుడు

Mahabharat Moral Story: మహాభారతంలో ధర్మరాజుకి విశిష్టస్థానం ఉంది. స్నేహం గుణం. క్షమాగుణం, హృదయ సౌందర్యం, తనకు ఉన్నంతలో ఇతరులకు..

Mahabharat Moral Story: గృహస్థ ధర్మం అంటే ఏమిటి.. సంసారం బంధాలను అధిగమించాలంటే ఏమి చెయ్యాలో చెప్పిన శౌనకుడు
Mahabharata Moral Story


Mahabharat Moral Story: మహాభారతంలో ధర్మరాజుకి విశిష్టస్థానం ఉంది. స్నేహం గుణం. క్షమాగుణం, హృదయ సౌందర్యం, తనకు ఉన్నంతలో ఇతరులకు ఇచ్చే తత్వం, శత్రువైనా సరే సహాయం కోరితే చేసే నైజం.. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడే నేచర్.. పొగడ్తలకు పొంగిపోకుండా .. ఇతరులకు మేలు చేసే లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. పాండవులు వనవాసం చేసే సమయంలో లోకబాంధవుడు సూర్యుడిని ప్రార్ధించి అక్షయపాత్రను పొందుతాడు ధర్మరాజు. దీనికి కారణం శౌనకుడు చూపించిన దారి.. అది ఏమిటంటే..

ధర్మరాజు విచారంతో చింతిస్తున్న సమయంలో శౌనకుడు ధర్మరాజుకి ఉపదేశం చేస్తూ.. ధర్మరాజా వివేకులు ఎప్పుడూ దు:ఖించరు, విచారంతో ఉండరు. ఈ బంధాలు తాత్కాలికం కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అని హితవు చెప్పాడు.

అప్పుడు ధర్మరాజు స్పందిస్తూ.. అయ్యా.. నా విచారం ధనం కోసం కాదు. నేను ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.. వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా.. ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం ఇవ్వడం గృహస్త ధర్మం. అది పాటించకుండా తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. అని ధర్మరాజు శౌనకుడికి చెబుతాడు.

దీంతో శౌనకుడు స్పందిస్తూ.. ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం.. అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం.. అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం చెయ్యి. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో అన్నాడు.

అప్పుడు ధర్మరాజు ధౌమ్యుడితో అయ్యా .. ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో ధర్మరాజా.. జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలను అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి ధర్మరాజా.. ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపది వండిన వంట నాలుగు విధాలైన వంటకాలుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయని వరం ఇచ్చాడు. అలా ధర్మరాజు సూర్యుడి నుంచి అక్షయపాత్రను వరంగా పొందాడు.

Also Read:  విశ్రాంతి సమయంలో నాడి వేగం గుండె పనితీరుకి చిహ్నం.. ఎలా నాడివేగాన్ని గుండె వేగాన్ని చూసుకోవాలంటే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu