AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharat Moral Story: పాప, పుణ్యాలు అంటే ఏమిటి..? వీటిని మానవుడు ఎలా అనుభవిస్తాడో తెలుసా..

Mahabharat Moral Story: హిందువులు పాపా పుణ్యాలను నమ్ముతారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం శాపంగా మారి ఎన్ని జన్మలైనా వెంటాడుతోందని

Mahabharat Moral Story: పాప, పుణ్యాలు అంటే ఏమిటి..? వీటిని మానవుడు ఎలా అనుభవిస్తాడో తెలుసా..
Indradyumna
Surya Kala
|

Updated on: Oct 04, 2021 | 4:21 PM

Share

Mahabharat Moral Story: హిందువులు పాపా పుణ్యాలను నమ్ముతారు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం శాపంగా మారి ఎన్ని జన్మలైనా వెంటాడుతోందని నమ్మకం. ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం. అయితే మానవులు పుణ్యకార్యాలను చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించారు.. కానీ పుణ్యఫలాన్ని ఆశిస్తారు. అయితే పాప, పుణ్యాలు అంటే ఏమిటి..? వీటిని మానవుడు ఎలా అనుభవిస్తాడు అన్నదానికి సంబంధించి మహాభారతంలో ఒక కథ ఉంది. అది ఏమిటంటే..

కృతయుగకాలంలో..  ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు.    గొప్ప దాత. దశమహాదానాలే కాక షోడశమహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాలవల్ల, అతను మరణించిన అనంతరం.. దేవదూతలు వచ్చి అతడిని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ…ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి.. నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది. నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు. ‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి… ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దీంతో దేవదూతలు ‘నిరూపిస్తావా’ అని అడిగారు  నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.

దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు. ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసిన వారు ఎవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోకవాసులందరిలోకి అతి వృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.. దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు’ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు. దీంతో అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు.

‘నేనెవరో తెలుసా’ అని అని గుడ్లగూబను అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు. అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు.‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు నాళీజంఘుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడంలోనూ మీరు చక్రవర్తే. ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనేకదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ..నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు. దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. ఇదీ కథ.

కనుక కలకాలం అందరూ చెప్పుకునే విదంగా మనిషి తనకు తోచిన విధంగా పరులకు భావితరాలకు ఉపయోగపడేలా పుణ్యకార్యాలే చెయ్యాలి.. అలాకాక పాపకార్యాలు చేస్తే… ప్రజలు తలుచుకున్నంత కాలం నరకబాధలు తప్పవు పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి,  భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం ఉన్నంతకాలం నలుగురికి సహాయపడాలి..  భగవంతుని అనుగ్రహం పొందాలని మహాభారతంలోని ఈ కథవలన తెలుస్తోంది.

Also Read: నిర్మించిన పది సినిమాలూ.. కళాఖండాలే.. మన ప్రభుత్వాలు గుర్తించని గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వర రావు వర్ధంతి నేడు