మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..

సనాతనధర్మం...కుంభమేళ పర్వం..మౌని అమవాస్యవేళ పుణ్యస్నానమాచరించడం అద్భుతం..అంటూ భక్తకోటి ప్రయాగ్‌రాజ్‌కు క్యూకట్టింది. ఇప్పటికే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. బుధవారం మౌని అమవాస్య సందర్భంగా 10కోట్లమంది భక్తులు వస్తారని అంచనా. మరి అంతమంది భక్తులు ఒకేరోజు..ఒకే ప్రాంతంలో ఉండే వీలుందా...? ఇందుకు యూపీ సర్కార్ తీసుకున్న చర్యలేంటి...భద్రతాపరంగా చేసిన జాగ్రత్తలేంటి..? ఇంతకూ మౌని అమవాస్య విశిష్టత ఏంటి..ఆరోజు స్నానమాచరిస్తే కలిగే శుభాలేంటి..?

మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..
Prayagraj Kumbh Mela
Follow us
TV9 Telugu

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 28, 2025 | 9:55 PM

మౌని అమవాస్య వేళ జనమహాసంద్రంగా మారింది. మంగళవారం మధ్యాహ్నానానికే 2.39కోట్లమంది ప్రయాగ్‌రాజ్‌కు రీచ్‌ అయ్యారు. మామూలుగా రోజుకు కోటిమంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2కోట్ల 39లక్షలమంది రావడంతో..ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అన్నిదారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూకట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్‌,..ఇలా పలుమార్గాల్లోనుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10నుంచి 12కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి…

జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్..మొదటి రోజునుంచే బారీ భక్తజనం పోటెత్తింది. తొలిరోజే పౌష్ పూర్ణిమ కావడంతో మొత్తం 1 కోటి 65 లక్షల మంది స్నానాలు చేసినట్లు లెక్కలు వచ్చాయి. అలా ఇప్పటివరకు దాదాపు 17కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అసలీ లెక్కలు కచ్చితంగా ఉంటాయా..లేదా అంటే 100శాతం కాకపోయినా గతం కంటే కచ్చితమైన లెక్కవస్తుందంటున్నారు అధికారులు. అసలీ భక్తుల లెక్కింపు ప్రక్రియ…రికార్డుల ప్రకారం భక్తులను మొదటిసారి 1882లో బ్రిటిష్ వాళ్లు లెక్కించారు. ఆ సమయంలో, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రతి రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి భక్తుడ్ని లెక్కించారు. రైల్వే స్టేషన్ టిక్కెట్లను కూడా జతచేర్చారు. అప్పుడు దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. దీని తర్వాత ప్రతి కుంభ్‌మేళాలో భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

కానీ, లెక్కింపు విధానం మాత్రం అలాగే ఉంది. కానీ ఈసారి లెక్కింపు ప్రక్రియ గతం కంటే భిన్నంగా ఉంది. డిజిటల్ కెమెరాల ద్వారా కౌంటింగ్ కొంచెం తేలికైంది. యూపీ ప్రభుత్వం ఈ ఏడాది నగరవ్యాప్తంగా 2700 కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో 1800 కెమెరాలను జాతర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1100 పర్మినెంట్ కెమెరాలు కాగా…మిగిలిన700 తాత్కాలిక కెమెరాలు. 270 కంటే ఎక్కువ కెమెరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIను ఇన్‌స్టాల్ చేశారు. లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుందంటే…ఓవ్యక్తి కమెరా సర్కిల్‌లోకి రాగానే ఆటోమేటిక్‌గా కౌంట్ చేయబడతాడు. ఏఐ కెమెరాలు ప్రతి నిమిషానికి డేటా అప్‌డేట్ చేస్తూ ఉంటాయి. మొత్తం మూడు విధాలుగా ఈలెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రయాగ్‌రాజ్ చేరుకునేందుకు 7ప్రధాన మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి త్రివేణి సంగమానికి చేరుకునేందుకు మొత్తం 12 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈసారి క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOP యాప్‌ను యూపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డ్యూటీ చార్ట్‌లు, రూట్ ప్లానింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పాంటూన్ బ్రిడ్జ్ ఏర్పాట్లతో పాటు క్రౌడ్ కంట్రోల్ ప్లాన్‌లు వంటి అన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలుంది.

బుధవారం మౌని అమవాస్య కావడంతో దాదాపు 8 నుంచి 10కోట్ల మంది భక్తజనం వస్తారని అంచనా. అందుకు తగ్గట్టుగానే భారీ బందోబస్తు, వసతి సౌతర్యాలు ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 24బై సెవెన్ భద్రతాబలగాలను మోహరించి..ఎలాంటి అవాంఛనీయా సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లును పకడ్బందీగా చేసింది యూపీ సర్కార్. మౌని అమవాస్యలో స్నానమాచరిస్తే పాపాలన్నీ హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే అఘోరాలు, సామాన్యులు, నాగ సాధువులు, ఇతర సాధువులు ప్రయాగ్‌రాజ్ వెళ్లి స్నానమాచరిస్తారు. ఈ శుభ ముహుర్తంలో పుణ్యస్నానం ఆచరించాలని చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున గంగా స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని, రాజ స్నానం తర్వాత దానధర్మాలు చేస్తే కచ్చితంగా శుభ ఫలితాలొస్తాయని భక్తుల నమ్మకం.

మౌని అమావాస్య రోజు మౌన వ్రతం పాటించే సంప్రదాయం ఉంది. సాధకులు ఈ రోజున మౌనంగా ఉపవాసం పాటిస్తారు. ఇది ప్రధానంగా స్వీయ నియంత్రణతో పాటు మానసిక ప్రశాంతత కోసం చేస్తారు. ఈ ఉపవాసాన్ని బుుషులు, సాధువులు కూడా ఆచరిస్తారు. ఎందుకంటే మౌనంగా ఉండటం వల్ల మనస్సును నియంత్రించడంతో పాటు ధ్యానంలో ఏకాగ్రత వస్తుంది. మౌని అమావాస్య ఉపవాసం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, స్వీయ నియంత్రణ, ధ్యానం ద్వారా మానసిక, ఆధ్యాత్మిక శాంతిని పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది. అంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే భక్తులు మౌని అమవాస్యలో త్రివేణిసంగమంలో స్నానమాచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు క్యూకట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..