Konaseema: వైభవంగా ప్రారంభమైన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూ వెలిసారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిలుతున్న వెంకన్న బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా మొదలయ్యాయి. ఏడువారాల వెంకన్నకు జరిగే బ్రహ్మోత్సవాలను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 12వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ఘనంగా మొదలయ్యాయి. చందన స్వరూపుడైన ఏడువారాల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాడపల్లికి పోటెత్తిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేతవెంకటేశ్వర స్వామి వారు విశేష పూజలు, ప్రత్యేక సేవలు అందుకోనున్నారు.
తొలి రోజు స్వస్తి వచనము, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము అకల్మష హోమము, అంకురార్పణ, ధ్వజారోహణము వంటి విశేష పూజలు శాస్త్రక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుంచి 29 వరకు వాడపల్లి దేవస్థానంలో జరిగే అష్టోత్తర పూజలు కళ్యాణములు మొదలగు ఆర్జిత సేవలు నిర్వహించబడవని ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..