Winter Care Tips: చలికాలంలో పగిలిన మడమలా.. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేయండి.. తయారు విధానం మీ కోసం
చలికాలంలో పగిలిన మడమలు, పగిలిన చర్మం సర్వసాధారణ సమస్యలు.. ఈ సమస్యను నెగ్లెక్ట్ చేయకూడదు. మాయిశ్చరైజర్లను అప్లై చేయడం వలన శీతాకాలంలో చాలా మందిలో వచ్చే చాలా సాధారణ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పగిలిన మడమలను రిపేర్ చేయడంలో సహాయపడే ఫుట్ కేర్ క్రీమ్‌ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
చలికాలంలో చర్మం బాగా పొడిబారడంతోపాటు ఈ సమయంలో నీళ్లలో పనిచేయడం వల్ల మడమల పగుళ్ల సమస్య కూడా మొదలవుతుంది. దీంతో ఇష్టమైన పాదరక్షలు కూడా వేసుకోలేరు. ఓపెన్ హీల్స్ ధరించినప్పుడు మడమలు చాలా అంద విహీనంగా కనిపిస్తాయి. అటువంటి సమయంలో పాదాలు కనిపించకుండా పాదరక్షలను ధరిస్తారు. మీకు కూడా చలికాలంలో మడమల పగుళ్ల సమస్యను ఎదురైతే.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కొన్ని సహజ పదార్థాలతో ఇంట్లోనే మాయిశ్చరైజర్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా పగిలిన మడమల చర్మాన్ని రిపేర్ చేస్తుంది.
పగిలిన మడమలను నివారించడానికి ఈ పనులు చేయండి
చలికాలంలో మడమలు ఎప్పుడూ పగుళ్లు ఉండి ఇబ్బంది పడుతుంటే ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టండి. ఉదాహరణకు పాదాలను చల్లటి నీటిలో తక్కువ సమయం ఉండేలా చూసుకోండి. రోజూ బయటికి వెళ్లవలసి వస్తే అప్పుడు చెప్పులకు బదులుగా క్లోజ్డ్ పాదరక్షలను, లేదా బూట్లు సాక్స్ ను ధరించండి. చలి పెరిగేకొద్దీ పాదాలకు సాక్స్ ను ధరించండి. మాయిశ్చరైజర్‌ని రోజుకు రెండు నుండి మూడు సార్లు (ముఖ్యంగా నీటిలో పనిచేసిన తర్వాత) క్రమం తప్పకుండా అప్లై చేయండి. వారానికి ఒకసారి పాదాలను గోరువెచ్చని నీటిలో కొంతసేపు నానబెట్టి.. ఆపై ఎక్స్‌ఫోలియేట్ చేయండి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది. మడమల పగుళ్ల సమస్య ఉండదు.
ఈ మూడు అంశాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి
మాయిశ్చరైజర్‌ను తయారు చేయడమే కాకుండా… గ్లిజరిన్, నిమ్మరసం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల కూడా పగిలిన మడమలను సరిచేయడంలో సహాయపడుతుంది. పసుపు కొమ్ముని కరిగించి.. దానికి కొబ్బరి నూనె, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఇంట్లోనే ఈ మాయిశ్చరైజర్‌ని తయారు చేయండి
బాణలిలో షియా బటర్ కరిగించి, కొబ్బరి నూనె, అవకాడో నూనె వేసి కలుపుతూ తక్కువ మంటపై వేడి చేయండి. ఈ మాయిశ్చరైజర్ 8 నుండి 10 నిమిషాల్లో సిద్ధం అవుతుంది. దీన్ని గాజు సీసాలో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి. మంచి సువాసన కోసం ఇష్టమైన నూనెను ఎంచుకుని కొన్ని చుక్కలను జోడించండి. ఈ మాయిశ్చరైజర్‌ను రోజులో రెండు మూడు సార్లు పగిలిన మడమల మీద అప్లై చేయండి. అంతేకాదు రాత్రి సమయంలో మాయిశ్చరైజర్ ను మందంగా అప్లై చేయండి. నిద్రపోయే ముందు సాక్స్ ను ధరించండి.
ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా ప్రతిరోజూ మడమల చర్మాన్ని తనిఖీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మడమలు పగుళ్లు పెరిగితే.. అప్పుడు నయం చేయడం కష్టం. అంతేకాదు ప్రతిరోజూ పుష్కలంగా నీరు సహా ఇతర ద్రవ పదార్థాలను తీసుకోండి. విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోండి. ఈ విధంగా శీతాకాలంలో ఏర్పడే మడమల పగుళ్ల సమస్యను నివారించుకోవచ్చు. అదే సమయంలో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)