Pallikondeswara Temple : పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుని అరుదైన క్షేత్ర మహిమ ఏమిటో .. ఎలా చేరుకోవాలో తెలుసా..!

సదా శివుడు కూడా శ్రీ మహావిష్ణువులా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. ఈ శైవ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తున్న ...

Pallikondeswara Temple : పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న శివుని అరుదైన క్షేత్ర మహిమ ఏమిటో .. ఎలా చేరుకోవాలో తెలుసా..!
Follow us

|

Updated on: Mar 01, 2021 | 5:25 PM

Pallikondeswara Temple : సర్వ సాధారణంగా శివుడు ఏ శైవ క్షేత్రాల్లో గానీ, శివాలయాల్లో గానీ లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.. అయితే అరుదైన క్షేత్రాల్లో మాత్రమే సశరీర రూపధారుడుగా దర్శనమిస్తాడు. సదా శివుడు కూడా శ్రీ మహావిష్ణువులా శయన భంగిమలో కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. ఈ శైవ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని శయనిస్తున్న శివుని అరుదైన దేవాలయం. పరమశివుడు కొలువైన క్షేత్రం .. ఆయన లీలా విశేషాలకి నిలయమైన క్షేత్రం ‘సురుటుపల్లి’ క్షేత్రం ఎక్కడ ఉందో .. ఎలా చేరుకోవాలో తెలుసుకుందా.!

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగలా పురం మండలం లో సూరటు పల్లి అనే గ్రామం ఉన్నది.. ఇక్కడ శివుడు శయన భంగిమలో ఉంటాడు..శ్రీ మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ది పొందిన ఈ క్షేత్రం పేరు, శివుడు శయన భంగిమ కు సంబంధించి ఓ ఆసక్తి కరమైన కథ ప్రచారంలో ఉన్నది.

దేవదానవులు అమృతం కోసం క్షీర సాగర మధనం చేసినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. హాలాహలం లోకాలను దహించి వేస్తుండగా… భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకూట విషాన్ని మింగి తన గరళం లో దాచుకొన్నాడు.. కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంత సేపు పార్వతి ఒడిలో సొమ్మసిల్లి .. ఆ తరువాత సేదదీరిన క్షేత్రం ఇది. గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహా విష్ణువు సుక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. అప్పటి నుండే శివుడు నీల కంటుడిగాను, శ్రీ మహా విష్ణువు నీలిమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు. విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు.

నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది. సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురుల పల్లి అనే పేరు వచ్చింది.. కాల క్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురటు పల్లిగా మారింది. శయన భంగిమలో ఉన్న శివుడిని దర్శించుకొంటే అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది.. మానసిక ప్రశాంతత కలుగుతుంది అని అంటారు.

ఆలయదర్శన వేళలు:

కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పళ్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు.

కోరికలు తీర్చే అభిషేకం..

పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి. స్వామి దర్శనం చేతనే వివాహయోగం కలుగుతుందని.. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం. శివుడి కోసం పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు. ఆయన్ని ఆరాధిస్తే విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.

పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు ఇక్కడ లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది.

బుక్కరాయలు నిర్మించిన ఆలయం:..!!

తిరుపతి- చెన్నై జాతీయ రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయం కొలువుదీరి ఉంది.  పల్లి కొండేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయాన్ని 1344-47 మధ్యకాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయలు నిర్మించారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలగడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా చెప్పారు.

ఈ క్షేత్రాన్ని ఇలా చేరుకోవచ్చు …

తిరుపతి నుండి 73 కిలోమీటర్లు చెన్నై వైపుగా, చెన్నై నుండి 68 కిలోమీటర్లు తిరుపతి వైపుగా ప్రయాణిస్తే చెన్నై–తిరుపతి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. తిరుపతి నుంచి సత్యవేడు వెళ్లే ఏపియస్‌ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేసి ఈ ఆలయాన్ని చేరవచ్చు. సురుటపల్లి చిన్న గ్రామం కావున ఇక్కడ అంతగా బసచేసే సౌకర్యం లేదు. ఆలయ కాటేజీ రూములు ఐదు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉన్నప్పుడు అద్దె చెల్లించి ఈ కాటేజీల్లో బస చేయవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత ఆలయ దర్శనాల బస్సు రోజు ఈ ఆలయానికి వస్తూ ఉంటుంది. ఈ బస్సులో తిరుపతి నుండి ఉచితంగా వచ్చి ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. వివరాలకు ఆలయ ఫోన్‌ నెంబర్‌ 07382005038లో సంప్రదించవచ్చు.

Also Read:

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!

సామజవరగమన అంటే నేటి తరంలో కొందరికి సినిమా పాటగానే తెలుసు..అసలైన అర్ధం ఏమిటంటే..!