తెలంగాణ పండుగల ప్రాశస్త్యం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పెద్దగట్టు జాతరలో మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జారతగా ప్రసిద్దికెక్కిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యాపేటలోని..

  • K Sammaiah
  • Publish Date - 2:56 pm, Mon, 1 March 21
తెలంగాణ పండుగల ప్రాశస్త్యం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పెద్దగట్టు జాతరలో మంత్రులు

తెలంగాణ రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జారతగా ప్రసిద్దికెక్కిన దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యాపేటలోని పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల తో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున జాతరకు బారులు తీరారు.

పెద్దగట్టు జాతర ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. యాదవుల మీద ఉన్న మక్కువతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో పెద్దగట్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పెద్దగట్టు లింగమంతుల స్వామిని ఆయన ఈ ఉదయం సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలసి సందర్శించారు. సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లతో పాటు శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య, యన్. భాస్కర్ రావు,బొల్లం మల్లయ్య యాదవ్,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సకల సదుపాయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నా ఎటువంటి ఆటంకాలు ఎదురుకావడం లేదని అన్నారు. అంచనాలకు మించి వస్తున్న భక్తులతో స్వరాష్ట్రం లో పెద్దగట్టు జాతర కన్నుల పండుగగా సాగుతుందని ఆయన అభివర్ణించారు. సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న అధికారులు పెద్దగట్టు చుట్టూ 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. అంతే గాకుండా సి సి కెమెరాలతో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు.

కరోనా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో శానిటేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, మొదటి ప్రాధాన్యత ఆంశంగా శానిటేషన్ ను పెట్టుకున్న సిబ్బంది షిఫ్ట్ ల వారిగా రౌండ్ ది క్లాక్ జాతర పరిసరాలను శభ్రపరుస్తున్నారన్నారు. కాళేశ్వరం జలాల ప్రభావం పెద్దగట్టు జాతర పై స్పష్టంగా కనిపిస్తోందన్నారు .ఆ జలాలతో సస్యశ్యామలం అయిన సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న లింగమంతుల జాతర లో పాల్గొంటున్న రైతుల కండ్లలో కనిపిస్తున్న ఆనందమే అందుకు నిదర్శనమన్నారు.

మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాతర అత్యంత వైభవంగా సాగుతుందన్నారు.లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్న జాతరలో కాళేశ్వరం జలాలు తెప్పించి త్రాగునీరు అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి యాదవ సమాజం రుణపడి ఉంటుందంటూ మంత్రి జగదీష్ రెడ్డిని కొనియాడారు. అంచనాలకు మించి హాజరవుతున్న రద్దీని దూరదృష్టి తో ఆలోచించిన మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద పెద్ద ట్యాన్క్ లు నిర్మించడం అభినందనీయమన్నారు. లింగమంతుల స్వామి యాదవులు ఇలవేల్పు అని అటువంటి స్వామి కరుణా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. తెలంగాణ కు మణిహారం యదాద్రిని అభివృద్ధి పరచడం తెలంగాణ రాష్ట్రం లో అత్యంత ప్రాశస్త్యం కలిగిన పెద్దగట్టు జాతర కు నిధులు మంజూరు చేయడం వంటి అంశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత కు అద్దం పడుతున్నాయన్నారు.నిధులను విడుదల చేయించడంతో పాటు అహర్నిశలు కృషి చేసి జాతర లో పూర్తి ఏర్పాట్లు జరిపించిన మంత్రి జగదీష్ రెడ్డికి సహచర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఇద్దరు మంత్రులకు సాదరంగా అహ్హనం పలుకగా మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు లింగమంతుల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.