AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతకంలో చంద్ర దోషమా..! గురు పౌర్ణమి రోజున ఈ వ్రత కథ వినండి.. ఉపశమనం లభిస్తుంది

"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః". ఈ శ్లోకం ప్రకారం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు. గురువుని పూజించడానికి, ఆరాధించడానికి పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

జాతకంలో చంద్ర దోషమా..! గురు పౌర్ణమి రోజున ఈ వ్రత కథ వినండి.. ఉపశమనం లభిస్తుంది
Guru Purnima
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 10:32 AM

Share

హిందూ మతంలో గురు పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్ఞానం, ప్రేరణ, మార్గదర్శకత్వాన్ని ఇచ్చే గురువు ఆవశ్యకతను తెలియజేస్తుంది గురు పౌర్ణమి. చీకటిని దూరం చేసి, అజ్ఞానాన్ని పోగొట్టి, సరైన జీవన మార్గాన్ని చూపే వారు గురువులు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ, వేద పూర్ణిమ అని కూడా అంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున ప్రజలు మహర్షి వేద వ్యాసుడిని పూజిస్తారు. అంతేకాదు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుంటారు.

“గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”. ఈ శ్లోకం ప్రకారం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానంగా భావిస్తారు. గురువుని పూజించడానికి, ఆరాధించడానికి పవిత్రమైన గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చంద్రోదయం తర్వాత చంద్రుడిని పూజించి.. చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వలన జాతకంలో చంద్ర దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.

పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తేదీ జూలై 20వ తేదీ శనివారం సాయంత్రం 05:59 గంటలకు ప్రారంభమై జూలై 21 ఆదివారం మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం జరిగే తిధిని పరిగణలోకి తీసుకోవడంతో ఆషాఢ పూర్ణిమ తిథి జూలై 21వ తేదీన ఉండనున్నది. అటువంటి పరిస్థితిలో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు. గురు పూర్ణిమ జరుపుకునే ఖచ్చితమైన తేదీ జూలై 21.

ఇవి కూడా చదవండి

ఎవరైనా గురు పౌర్ణమి రోజు ఉపవాసం పాటించి గురువుల ఆశీస్సులు పొందాలనుకుంటే.. చంద్ర దోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే గురు పూర్ణిమ కథను చదివి.. కోరిక కోర్కెలు తీర్చమని ప్రార్ధించాలి.

గురు పౌర్ణమి రోజున చదవాల్సిన కథ పురాణాల కథ ప్రకారం మహర్షి వేదవ్యాసుడు శ్రీ మహా విష్ణువు అంశ అని భావిస్తారు. వేదవ్యాసుడు తల్లి పేరు సత్యవతి, తండ్రి పేరు పరాశరుడు. వేదవ్యాసుడుకి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై చాలా ఆసక్తి ఉండేది. ఒకసారి అతను తన తల్లిదండ్రుల వద్ద భగవంతుని చూడాలనే కోరికను వ్యక్తం చేసి.. అడవిలో తపస్సు చేయడానికి అనుమతి కోరాడు. కొడుకు కోరిక విన్న అతని తల్లి వేదవ్యాసుడుని అడవికి వెళ్లకుండా అడ్డుకుంది.

అయితే వేదవ్యాసుడు ఎలాగైనా దైవాన్ని దర్శించుకోవాలని భావించి అడవికి వెళ్లాలని కోరుకున్నాడు. తల్లికి తన కోరికను బలంగా వినిపించినప్పుడు తల్లి సత్యవతి తన కుమారుడికి అడవికి వెళ్ళడానికి అనుమతిని ఇచ్చింది. తల్లి అంగీకారంతో వేదవ్యాసుడు అడవికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్న సమయంలో సత్యవతి ఎప్పుడైనా ఇల్లు గుర్తుకు వస్తే వెంటనే తిరిగి రమ్మనమని చెప్పింది. తల్లి మాటలను అంగీకరించిన వేదవ్యాసుడు అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు.

వేదవ్యాసుడు కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. భగవంతుని ఆశీర్వాదంతో వేదవ్యాసుడు సంస్కృత భాషలో జ్ఞానం పొందారు. దీని తరువాత అతను వేదాలు, మహాభారతం, 18 మహాపురాణాలు, బ్రహ్మ సూత్రాలను రచించాడు. ప్రజలకు వేద జ్ఞానాన్ని అందించడం వల్లనే నేటికీ గురు పూర్ణిమ రోజున తొలి గురువుగా వేదవ్యాసుడు స్మరించుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు