దేవాయంలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు..? ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా..?
Pradakshina Meaning: ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ తిరుగుతూ ఆయనను స్మరించడం, భక్తితో నమస్కరించడం, మన మనసులోని భావాలను వ్యక్తపరచడం. ఇది భక్తి, వినయం, సంపూర్ణ శరణాగతికి సూచిక. మూడు ప్రదక్షిణలు చేయడం వెనుక కూడా గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ మూడు సంఖ్యలు సృష్టిలో ఉన్న మూడు గుణాలను సూచిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో ఆలయానికి వెళ్లినప్పుడు దేవత చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒక పవిత్రమైన ఆచారం. దేవుడిని కేంద్రంగా చేసుకుని కుడి వైపు నుంచి తిరుగుతారు. సాధారణంగా చాలా మంది భక్తులు ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం ప్రతి దేవతకు ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంది. ఆ విధంగా ప్రదక్షిణ చేయడం వల్ల దేవుని అనుగ్రహం మరింత సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు.
ప్రదక్షిణ అంటే ఏమిటి?
ప్రదక్షిణ అంటే దేవుని చుట్టూ తిరుగుతూ ఆయనను స్మరించడం, భక్తితో నమస్కరించడం, మన మనసులోని భావాలను వ్యక్తపరచడం. ఇది భక్తి, వినయం, సంపూర్ణ శరణాగతికి సూచిక. మూడు ప్రదక్షిణలు చేయడం వెనుక కూడా గొప్ప ఆధ్యాత్మిక భావం ఉంది. ఈ మూడు సంఖ్యలు సృష్టిలో ఉన్న మూడు గుణాలను సూచిస్తాయి.. సత్వ, రజస్, తమస్. అలాగే మూడు లోకాలు అయిన భూలోకం, స్వర్గం, నరకం అనే భావనలకు కూడా సంకేతంగా భావిస్తారు.
భక్తుడు దేవుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ మూడు లోకాలలోనూ దేవుని శక్తి వ్యాపించి ఉందని గుర్తుంచుకుంటాడు. మన కష్టాలను వినే దేవుడు మన జీవితంలోని బాధలను తొలగిస్తాడని విశ్వాసం కలుగుతుంది. మనలో ఉన్న కోపం, అహంకారం, అసూయ వంటి లోపాలను దూరం చేయడానికి ఈ మూడు గుణాల సమతుల్యత ఎంతో అవసరం.
ప్రదక్షిణ చేయడం అంటే కేవలం తిరగడం మాత్రమే కాదు. అది కాయ (శరీరం), వచనం (మాట), మనస్సు (భావం).. ఈ మూడు ద్వారా దేవునికి సంపూర్ణ శరణాగతి ప్రకటించడం.
వివిధ దేవతలకు ప్రదక్షిణ విధానం
గణపతి:
గణపతికి ఒక పూర్తి ప్రదక్షిణ చేస్తే సరిపోతుందని శాస్త్రాలు చెబుతాయి. నెమ్మదిగా, భక్తితో ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం.
శివుడు:
శివాలయంలో పూర్తి ప్రదక్షిణ చేయకుండా సోమసూత్ర ప్రదక్షిణ అనే సగం ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఇది శైవ ఆగమాలలో చెప్పబడిన ప్రత్యేక విధానం.
దుర్గ అమ్మవారు:
అమ్మవారి ఆలయాలలో నాలుగు ప్రదక్షిణలు చేయడం శుభంగా భావిస్తారు. ఇది నాలుగు దిశలను సూచిస్తూ దేవి శక్తి అన్ని వైపులా వ్యాపించి ఉందని తెలియజేస్తుంది.
Surya (సూర్య భగవాన్):
సూర్యుడికి నమస్కారం చేసే ప్రదేశంలోనే ఏడు ప్రదక్షిణలు చేస్తే ఆయన సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ ఏడుసార్లు తిరగడం సప్తగ్రహాలు, సప్తలోకాలు, జీవశక్తికి సంకేతంగా భావిస్తారు.
మొత్తానికి, ప్రదక్షిణ అనేది కేవలం శారీరక క్రియ మాత్రమే కాదు. అది మన భక్తి, వినయం, విశ్వాసం, దేవుని పట్ల సంపూర్ణ సమర్పణకు ప్రతీక. భక్తితో చేసిన ఒక్క ప్రదక్షిణ కూడా దేవుని కృపను పొందడానికి సరిపోతుంది. ఇక, ఏ దేవుడికైనా మూడు ప్రదక్షిణలు శుభంగా భావిస్తారు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)
