Andhra Pradesh: అనంతలో వింత ఆచారం.. 11ఏళ్ల బాలికకు దేవునితో పెళ్లి.. టీటీడీ తరఫున పట్టువస్త్రాలు..!
Andhra Pradesh: ఒక 11ఏళ్ల బాలికకు దేవునితో పెళ్లి.. ఇదేంటి ఈ వింత ఆచారం అనుకుంటున్నారా.. దశాబ్ధాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
Andhra Pradesh: ఒక 11ఏళ్ల బాలికకు దేవునితో పెళ్లి.. ఇదేంటి ఈ వింత ఆచారం అనుకుంటున్నారా.. దశాబ్ధాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. వేద మంత్రాల సాక్షిగా శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామితో బాలికకు వివాహం జరిగింది.. ఈ కల్యాణ వేడుకకు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించడం మరో విశేషం. ఇంతకీ ఈ వేడుక ఎక్కడ జరిగిందంటే.. ఎందుకు ఆ ఆచారమో చూడండి..
అనంతపురం జిల్లా రాయదుర్గంలో గత కొన్ని దశాబ్ధాలుగా ఒక వింత సాంప్రదాయం ఉంది. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామికి ఒక బాలికకు వివాహం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సాంప్రదాయం ఇక్కడి ఆలయంలో కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల బాలికలకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది వారి భక్తుల నమ్మకం. ఇందులో భాగంగా ఈఏడాది కూడా శ్రీవారితో కల్యాణ వేడుక ఘనంగా జరిగింది. భక్త మార్కండేయ స్వామి ఆలయం వద్ద నుంచి బాలికను స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు బాజాభజంత్రీలు మంగళవాయిద్యాల నడుమ పుర వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ఆలయంలో ప్రసన్న వెంకటరమణ స్వామి విగ్రహం ముందు బాలికను కూర్చోబెట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ పండితులు స్వామివారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఏడాది కల్యాణోత్సవంలో టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొనడం విశేషం. స్వామి వారి కల్యాణోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అబిజిన్ లగ్నంలో స్వామివారికి 11.30 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించాల్సి ఉండగా, టిటిడి చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి రాక కోసం దాదాపు 3 గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ రాక కోసం భక్తులు దాదాపు 3 గంటల పాటు ఎదురు చూడాల్సి రావడంతో పాటు స్వామివారి కల్యాణోత్సవం ఆలస్యంగా నిర్వహించడం పై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కళ్యాణోత్సవం వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల సందడితో ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం కిటకిటలాడింది. కళ్యాణ వేడుకలు తిలకించేందుకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు…
స్వామి వారి కల్యాణోత్సవ వేడుకలకు టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా రావడంతో పోలీసులు ఆలయ ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి కాపు భారతి, పట్టణ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.