AP Cabinet: జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం.. పూర్తి వివరాలు..
నేడు ఏపీ కేబినేట్ సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన, రాజధాని అమరావతి అభివృద్ధి.. ఇలా పలు కీలక అంశాలపై కేబినేట్ భేటి కానుంది. కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి.

ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకూ పలు అంశాలపై లోతైన చర్చ జరగనుంది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, రుషికొండపై నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గం. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యలపై చర్చించనుంది. మరోవైపు అమరావతిలో క్వాంటం వ్యాలీ, సీఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్.
అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతాన్ని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకు సంబంధించిన భూముల వివాదాలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా క్యాబినెట్ ముందుకు రానుంది.
అటు నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించారు. అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు అయోధ్య టెంపుల్ నిర్మాణ విశేషాలను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా.. అయోధ్యకు మరోసారి రావడం ప్రశాంతత కలిగించడంతోపాటు.. గొప్ప ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమైన పాఠాలని, అవి ఎల్లప్పుడూ మన జీవితాలను ముందుకు నడిపించే దిశగా ఉండాలని ఆకాంక్షించారు.
