దసరా నవరాత్రులు.. ఎక్కడ బాగా చేస్తారంటే..?

భారతదేశం వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు. ప్రతియేటా నవరాత్రి వేడుకలు ముగిశాక.. పదో రోజున దసరాను జరుపుకోవడం అనవాయితీ. కాగా, ఈ రోజున దేశవ్యాప్తంగా వేరు వేరు రాష్ట్రాల్లో వేరువేరు కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలూ నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా ఈ పండుగ విశిష్టతను చెప్పుకుంటారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే.. రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా ఈ పండుగను […]

దసరా నవరాత్రులు.. ఎక్కడ బాగా చేస్తారంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 5:57 PM

భారతదేశం వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు. ప్రతియేటా నవరాత్రి వేడుకలు ముగిశాక.. పదో రోజున దసరాను జరుపుకోవడం అనవాయితీ. కాగా, ఈ రోజున దేశవ్యాప్తంగా వేరు వేరు రాష్ట్రాల్లో వేరువేరు కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలూ నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా ఈ పండుగ విశిష్టతను చెప్పుకుంటారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే.. రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే తూర్పు, ఈశాన్య దసరా అంటే.. రాక్షసుల రాజు మహిషాసురిడి పై దుర్గమ్మ సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటూ దుర్గమ్మకు వివిధ రూపాల్లో పూజలు చేశాక… పదో రోజున దసరా వేడుకలతో ఈ పండుగ ముగుస్తుంది.

వినాయకచవితిలాగే దసరా నవరాత్రులు కూడా జరుపుతారు. తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు జరిపి.. పదో రోజున అమ్మవారి విగ్రహాల్ని చెరువులు, నదుల్లో నిమజ్జనం చేస్తారు. ఇక అదే రోజు రావణాసురుడి దిష్టిబొమ్మలను పెట్టి తగులబెడతారు. రావణాసురుడి దిష్టి బొమ్మతో పాటు.. సోదరులైన మేఘనాద, కుంభకర్ణుల దిష్టిబొమ్మల్ని కూడా తగులబెడతారు. ఇక దేశవ్యాప్తంగా వేరు వేరు ఆచారాలను పాటిస్తున్నా.. అన్నింటి సందేశం ఒక్కటే అని చెప్పొచ్చు. చెడు పై మంచి విజయం. చెడు ఎప్పటికీ గెలవదు అని అర్థమవుతోంది.

మైసూర్ నగరం దసరా పండుగకు పెట్టింది పేరు. దసరా వస్తుందంటే కర్ణాటక అంతటా పండుగే. మైసూర్‌లో జరిపే దసరా వేడుకలకు 500 ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడి దసరా వేడుకలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ప్రజలు తరలివస్తారు. అంతేకాదు, దీని చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటారు. 15వ శతాబ్ధంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుర్ రజాక్ తన మట్టా ఉస్ సదైన్ వా మజ్మా ఉల్ బహ్రోయిన్ అనే పుస్తకంలో ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో జరిగే దసరా వేడుకల గురించి వివరించారు. విజయనగర సామ్రాజ్య పతనం తరువాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది. మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నలో దసరా ఉత్సవాలు నిర్వహించేవారు. దసరా జరిగే పది రోజులు మైసూరు ప్యాలెస్, చాముండీ కొండ దీప కాంతుల్లో వెలుగులీనుతాయి.ఇక 1805లో 1805లో కృష్ణరాజ ఉడయార-3 పాలన నుంచి దసరా జరిగే రోజుల్లో మైసూరు ప్యాలస్‌లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం సాంప్రదాయంగా మారింది. ఇక్కడ రాజబంధువులు, రాజకుటుంబాలు, అతిథులు, అధికారులతో పాటు ప్రజలు కూడా పాల్గొనేవారు.

ఇక్కడి దసరా వేడుకల్లో అప్పుటి రాజుల ఊరేగింపు ప్రత్యేకంగా ఉండేది. ఏనుగులు, అశ్వదళాలు, సైన్యం.. చెప్పాలంటే బాహుబలిలో మహిష్మతి రాజ్యాన్ని మించిన వైభవం ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ఆ వేడుకలు కాస్త కళ తప్పినా.. అప్పటి సాంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.2013 డిసెంబరులో శ్రీకంఠ ఉడయారు చనిపోయేంతవరకూ ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. మైసూర్, పశ్చిమబెంగాల్, ఒడిషా, రామ్‌లీలా మైదాన్, గుజరాత్, వారణాసి, కులులోయ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుతారు.

ఇక విజయవాడలో అయితే దసరా సంబరాలు అంబరాన్నంటుతాయి. నవరాత్రుల వేడుకల్లో దుర్గమ్మ తొమ్మది రోజులలో, ప్రతిరోజూ ఒక్కో రూపంలో అలంకరించబడి ఊరేగుతారు. చివరి రోజు ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో వంద సంవత్సరాల నుంచి ఏనుగుల సంరంభం జరపడం ఆనవాయితీగా వస్తోంది. వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగును అంబారీతో చూడముచ్చటగా అలంకరిస్తారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింది నుంచి దూరనిస్తారు. ఇలా చేస్తే పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.

విజయనగరంలో దసరా సమయంలో పైడితల్లికి పూజలు చేస్తారు. పండుగ రోజున పూజారిని సిరిమాను ఎక్కించి ఊరంతా ఊరేగిస్తారు. పండుగ తరువాత మొదటి మంగళవారం రోజు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఇక మచిలీపట్నంలో దసరాని పురస్కరించుకుని శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు బందరు పురవీధుల్లో ఈ ఊరేగింపు జరుగుతుంది. చివరి రోజు కోనేరు సెంటర్ వద్ద జమ్మి కొట్టడంతో ఊరేగింపు ముగుస్తుంది.