Health Tips: వేగంగా బరువు తగ్గుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమ బరువుని తగ్గించుకోవడానికి రకరకాల టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది తమ ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులను తగ్గించి తద్వారా త్వరగా బరువు తగ్గుతారు. అయితే తక్కువ సమయంలోనే వేగంగా బరువు తగ్గడం ఆరోగ్య పరంగా సురక్షితమేనా? వేగంగా బరువు తగ్గడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం కలుగుతుందో తెలుసుకుందాం.
బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. దీనికి చాలా నెలలు పట్టవచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగం నడుస్తోంది.. దీంతో ప్రజలు కొన్ని రోజుల్లో బరువు తగ్గడం ఎలా అంటూ మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా కష్టపడి పని చేయకుండా త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. అయితే వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రతికూల ప్రభావాలు పడతాయని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. అయితే..బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన జీవనశైలి దినచర్యలో భాగం కావచ్చు.. కానీ చాలా త్వరగా బరువు తగ్గడం వల్ల శరీరానికి అనేక విధాలుగా హాని కలుగుతుంది.
పోషకాహార లోపం: వేగంగా బరువు తగ్గాలని అనుకున్నప్పుడు తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకుంటారు. అటువంటి ఆహారంలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లోపం ఉండవచ్చు. దీని వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, పోషణ అందదు. దీని కారణంగా బలహీనత, అలసట, రోగనిరోధక శక్తి ప్రభావితమవుతుంది.
కండరాలు ప్రభావితం: కండరాలు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. వేగంగా బరువు తగ్గినప్పుడు, కొవ్వు మాత్రమే కాదు శరీరంలోని కండరాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. అప్పుడు జీవక్రియ కూడా దెబ్బతింటుంది.
హార్మోన్ల అసమతుల్యత: వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత అనేక సమస్యలను కలిగిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలను కలిగిస్తుంది.
అలసట, బలహీనత: పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పడిపోతాయి. ఈ కారణంగా తలనొప్పి, మైకము, అలసట వంటి సమస్యలతో ఫీల్ అవుతారు. బద్ధకం, బలహీనత కారణంగా రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారవచ్చు.
అటువంటి పరిస్థితిలో వేగంగా బరువు తగ్గాలని భావించవద్దు. బరువు వేగంగా కాకుండా.. మెల్ల మెల్లగా క్రమంగా బరువు తగ్గండి. తద్వారా ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు. తినే ఆహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)