కనిపించని ఏసీ కోచ్‌.. షాకైన ప్రయాణికులు..?

కనిపించని ఏసీ కోచ్‌.. షాకైన ప్రయాణికులు..?

Samatha J

|

Updated on: Jan 11, 2025 | 7:40 PM

శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సాధారణం. అలాగే ఈ సీజన్‌లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తతెత్తుతుంటాయి. దీనికి భిన్నమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. దీని గురించి తెలుసుకున్నవారంతా అవాక్కవుతున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ రైల్వే జంక్షన్ లో విచిత్రం జరిగింది. జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్‌ప్రెస్ లో వెళ్లేందుకు వచ్చిన 64 మంది ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. వారంతా ఏసీ కోచ్‌లో సీటు కోసం రిజర్వేషన్‌ చేయించుకున్నారు. అయితే రైలులో తమ కోచ్‌ కనిపించకపోవడంతా వారంతా అవాక్కయ్యారు. వారు ఎదురు చూసిన రైలులో బీఈ-1 థర్డ్ ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేయలేదు.

దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇంతలో ఒక ప్రయాణికుడి దృష్టి నాన్ ఏసీ కోచ్‌పై పడింది. దానిపై బీఈ-1/ఎస్‌ఎల్ అని రాసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ కాదు. దీంతో 36 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనను చూసిన రైల్వే అధికారులు ఆ కోచ్‌ దగ్గరకు చేరుకున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ రైలులో థర్డ్‌ ఏసీ కోచ్‌ సౌకర్యం ఉండదని, స్లీపర్‌ కోచ్‌లోనే ప్రయాణించాలని వారు తెలియజేశారు. అలాంటప్పుడు థర్డ్‌ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేశారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.

వాస్తవానికి నెల్లాళ్ల క్రితమే ఈ రైలు నుంచి ఏసీ కోచ్‌ను తొలగించారు. అయితే దీనిని టిక్కెట్లు జారే చేసే కంప్యూటర్‌ సిస్టమ్‌ నుంచి తొలగించలేదు. దీంతో టిక్కెట్లు జారీ అయ్యాయి. గత డిసెంబర్‌లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ ఏసీ క్లాస్‌తో కూడిన తాత్కాలిక కోచ్‌ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు. సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో, ఈ కోచ్‌లో 64 మంది ప్రయాణికుల బుకింగ్‌ జరిగింది. తరువాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఏసీబోగీలో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.