రామనాథస్వామి ఆలయంలో కనువిందు చేసిన ‘చొక్కపనై’ దీపం.. భారీగా తరలి వచ్చిన భక్తులు..

తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రామనాథ స్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన..

  • Shiva Prajapati
  • Publish Date - 1:38 pm, Mon, 30 November 20
రామనాథస్వామి ఆలయంలో కనువిందు చేసిన ‘చొక్కపనై’ దీపం.. భారీగా తరలి వచ్చిన భక్తులు..

తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రామనాథ స్వామి ఆలయంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ‘చొక్కపనై’ దీపాన్ని ఈ ఏడాది కూడా వెలిగించారు. ఆ దీప దర్శనం కోసం తెల్లవారుజామునే భక్తులంతా పెద్ద ఎత్తున తరలి రాగా, వారి సమక్షంలో తాటాకులతో గూడగా అల్లి దానికి పూజ చేసి, దీపారాధన చేసి కర్పూర జ్యోతిని దానిలో వెలిగించారు అర్చక స్వాములు. ఈ సందర్భంగా భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటు ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని రామేశ్వరంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ మాదిరిగానే ప్రతి ఇంట దీపాలు వెలిగించి దేవతలకు పూజలు నిర్వహిస్తారు. ఇంకా ముఖ్యంగా రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో ‘చొక్కపనై’ దీపం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రామనాథ స్వామి ఆలయంలో ముందు భాగాన తాటాకులతో పెద్ద గూడగా అల్లి దానికి పూజ చేసి, దీపారాధన చేసి కర్పూరజ్యోతిని దానిలో వెలిగిస్తారు. ఆ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. పురాణాల కాలం నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోందని ఆలయ పూజారులు చెబుతున్నారు. అయితే, రామనాథ స్వామి ఆలయంతో పాటు పరివర్థని అంబల్ ఆలయంలోనూ ఈ ‘చొక్కపనై’ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.